జగన్‌తో మరోసారి బాలినేని చర్చలు, అమీతుమీ దిశగా అడుగులు..!?
ఏపీలోనే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అంశం ప్రస్తుతం చర్చనీయాంశగా మారింది. సొంత పార్టీ నేతలు కార్యకర్తలు తన వద్దకు వచ్చిన సహాయమడిగితే అది చేయటం తప్పు అన్నట్లు కొంత మంది పార్టీ పెద్దలు పనిగట్టుకుని పనిచేస్తున్నారని తనపై ఫిర్యాదులు చేయిస్తున్నారంటూ ఆయన కంటతడి పెట్టారు. తనను నమ్ముకున్న కార్యకర్తలు నాయకుల కోసం ఎందాకైనా పోరాడుతానని సీఎం జగన్ నాయకత్వంలోనే తాను పనిచేస్తానంటూ ప్రతినబూనారు. హైదరాబాదు నుండి ఒంగోలుకు వచ్చిన ఆయన శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడి ఆవేదన వెలిబుచ్చారు.
తాను రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేయటానికి గల కారణాలు సొంత పార్టీ నేతలు తనపై పని కట్టుకొని తప్పుడు ప్రచారం చేయటం వంటి పలు అంశాలపై మీడియా ముందు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. బాలినేని ప్రాంతీయ సమన్వయకర్తకు రాజీనామా దగ్గర నుండి తాజా మీడియా సమావేశం వరకు జరుగుతున్న పరిణామాలు అన్నింటిని నిశ్చితంగా పరిశీలిస్తున్న పార్టీ అధిష్టానం బాలినేని శ్రీనివాసరెడ్డి అంశానికి ఫుల్ స్టాప్ పెట్టే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఆయనను సీఎం జగన్‌తో మరో మారు భేటీ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయనకు సమాచారం కూడా అందింది. అందుకు ఆయన కూడా సుమఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

రెండు మూడు రోజుల్లోనే సీఎం జగన్‌తో బాలినేని భేటీ ఉండబోతుందని తెలుస్తోంది. అయితే ప్రాంతీయ సమన్వయకర్త పదవికి రాజీనామా అంశాన్ని మాత్రం ఆయన వెనక్కి తీసుకోలేదని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఆయనను ఒంటరిగా సీఎంతో మాట్లాడించగలిగితేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఒంగోలులోని ఆయన అనుచరులు చెబుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుండి నిజాయితీగా పార్టీకి కట్టుబడి పని చేస్తున్న తన పట్ల పార్టీ పెద్దలే తప్పుడు ప్రచారాలు చేయటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారన్నది ఆయన మీడియా సమావేశం సారాంశంగా ఉంది.

ఇప్పటికే నెల్లూరు జిల్లా అంశంలో బలంగా ఉన్న పార్టీ నిలువునా మూడు ముక్కలైన నేపథ్యంలో ఇంకొక జిల్లాలో ఇదే తరహా పరిస్థితి ఏర్పడితే సీఎం జగన్ ఉపేక్షించే పరిస్థితి కనపడటం లేదు. ఈ నేపథ్యంలోనే పార్టీ పెద్దలు నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ఆయనతో పలు దఫాలుగా మాట్లాడుతున్నారు. పార్టీలో ముఖ్యమైన నేతలే ఆయనతో స్వయంగా మాట్లాడుతూ ఆవేశానికి వెళ్లొద్దంటూ సూచిస్తున్నారు. ఆయన మాత్రం పార్టీని వీడే ప్రసక్తే లేదని ప్రాణం ఉన్నంతవరకు సీఎం జగన్‌తోనే ఉంటానని చెబుతున్నారు. సీఎంతో త్వరలో జరగనున్న భేటీతో బాలినేని అలక వీడతారా లేదా అనేది చూడాల్సి ఉంది.