ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్
వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయిన ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఖాదీర్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు రాజాసింగ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఆ తర్వాత రాజాసింగ్ తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి… ఓ వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే 41ఏ సీఆర్‌పీసీ సెక్షన్ కింద నోటీసులు ఇవ్వాల్సి ఉందని, అయితే రాజాసింగ్‌కు అలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారంటూ కోర్టు పోలీసులను తప్పుబట్టింది. రాజాసింగ్‌ను అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించలేదని ఆయన తరుఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇరు వర్గాల వాదనలు సావదానంగా విన్న న్యాయమూర్తి… రాజాసింగ్ రిమాండ్ రిపోర్ట్‌ను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. వెంటనే రాజాసింగ్‌ను విడుదల చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. కేసు దర్యాప్తులో రాజా సింగ్ పోలీసు అధికారులకు సహకరించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
మరోవైపు.. నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ, ఎంఐఎం కార్యకర్తల పోటాపోటీ నినాదాలు చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరుపార్టీల కార్యకర్తలు, అనుచరులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. కోర్టు లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇరు వర్గాల పోటా పోటీ నినాదాలు.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. రెండు వర్గాల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఒకవైపు నాంపల్లి కోర్టు లోపల వాదనలు కొనసాగుతుంటే.. ఇంకోవైపు బయట ఆందోళనలు జరిగాయి.