Home Page SliderTelangana

గజ్వేల్‌, కామారెడ్డిలో కేసీఆర్‌కు బ్యాడ్ టైమ్స్

గజ్వేల్‌లో కేసీఆర్‌కు టఫ్ ఫైట్
పోటీకి సై అంటున్న బీజేపీ అగ్రనేత ఈటల
కామారెడ్డిలో పోటీకి సై సై అంటున్న బీజేపీ, కాంగ్రెస్
కేసీఆర్‌ను ఢీకొడతానంటున్న రేవంత్, అర్వింద్
రోజు రోజుకు తగ్గుతున్న బీఆర్ఎస్ గ్రాఫ్
ఓటింగ్‌కు ముందే కేసీఆర్‌కు దడదడ

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కష్టకాలం మొదలైనట్టుగా ఉంది. రాజకీయ గ్రహణం ఇప్పుడు ఆయనను ఊపిరాడకుండా చేసేలా వాతావరణం కన్పిస్తోంది. ఏ క్షణాన ఆయన రెండు చోట్ల నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారో… ఇప్పుడు అవే ఆయనకు సవాల్ విసురుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్‌తోపాటు, కామారెడ్డిలోనూ బరిలో దిగాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. గజ్వేల్ అభివృద్ధి కలిసి వస్తోందని, కామారెడ్డిలో సంక్షేమ కార్యక్రమాలు ఒడ్డున చేరేస్తాయని కేసీఆర్ భావిస్తున్నారు. తాజాగా ప్రకటించిన మేనిఫెస్టో మరోసారి పార్టీకి, తనకు అఖండ విజయాన్ని అందిస్తాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా.. ఇన్నాళ్లూ ఏ ప్రత్యర్థులనైతే రాజకీయంగా ఇబ్బంది పెట్టాడో ఇప్పుడు వారి నుంచే కేసీఆర్‌కు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అవుతోంది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను గజ్వేల్ లో ఓడించి తీరతానంటూ బీజేపీ అగ్రనేత, పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ స్పష్టం చేస్తున్నారు. కేసీఆర్ ఎక్కడ్నుంచి పోటీ చేసినా బరిలో దిగుతానంటూ తేల్చి చెప్పారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను ఏ విధంగా వంచిస్తున్నారో ప్రజలకు వివరిస్తానన్నారు. ముఖ్యంగా బడుగు, బలహీనవర్గాలు కేసీఆర్ పాలనలో ఎలా నలిగిపోతుందీ వివరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ అహంకారాన్ని అణిచివేయకపోతే ప్రజల ఆగమైపోతారని ఈటల అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈటలకు మద్దతుగా గజ్వేల్ ప్రజలు ఏకమవుతున్నారు. ఈటలకు మద్దతుగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా గజ్వేల్ బీఆర్ఎస్ నేతలు సైతం ఈటలను గెలిపించుకుంటామంటూ నినదిస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఫంక్షన్ హాల్‌లో సమావేశమై మద్దతు తెలిపారు. ప్రజలను గొర్రెల్లా చూస్తున్న కేసీఆర్‌కు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్తామంటూ స్థానిక నాయకులు తేల్చి చెబుతున్నారు. ఈటల గజ్వేల్ నుంచి పోటీ చేస్తే బ్రహ్మరథం పడతామంటూ గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ ఛైర్మన్ గాడిపల్లి భాస్కర్, ఏఎంసీ మాజీ ఛైర్మన్ టేకులపల్లి రాంరెడ్డి, మాజీ జడ్పీటీసీ సింగం సత్తయ్య చెప్పారు. ఈ సమావేశంలో 150 మంది స్థానిక నాయకులు పాల్గొనడం విశేషం.

మరోవైపు కేసీఆర్‌ను వచ్చే ఎన్నికల్లో ఓటించేందుకు మేము సైతం సై అంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సై సై అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇప్పటికే కొడంగల్ నుంచి బరిలో దిగుతున్న రేవంత్ రెడ్డి, పార్టీ అవకాశం ఇస్తే కామారెడ్డి నుంచి కేసీఆర్‌ను ఢీకొడతానంటున్నారు. గత ఎన్నికల్లో కొడంగల్‌లో రేవంత్ రెడ్డిని ప్రభుత్వం కార్నర్ చేసి ఓడించిందన్న అభిప్రాయం ఉంది. ఎన్నికల సమయంలో పోలీసులతో సోదాలు, కార్యకర్తలపై ఒత్తిడితో అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచిందన్న అభిప్రాయం ఉంది. అయితే ఈసారి ఎన్నికల్లో తాను కొడంగల్ తోపాటుగా కామారెడ్డి నుంచి పోటీ చేసి కేసీఆర్ పై ప్రతీకారం తీర్చుకుంటునంటున్నారు.

అదే సమయంలో కేసీఆర్ పై పోటీకి సిద్ధమంటూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కాలు దువ్వుతున్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీని మీడియా సాక్షిగా దుమ్మెత్తి పోసే అర్వింద్ తాజాగా కేసీఆర్ ఓటమిని తాను చూస్తానంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్ తనయ కవితను ఓడించిన అర్వింద్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆర్మూర్, కోరుట్లలో ఒక చోట నుంచి పోటీ చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. తాజాగా కేసీఆర్ పై కామారెడ్డిలోనూ అమీతుమీకి సిద్ధమంటున్నారు. కేసీఆర్‌ అటు గజ్వేల్, ఇటు కామారెడ్డి రెండు చోట్ల ఓడిపోతారంటూ అర్వింద్ జోస్యం చెబుతున్నారు.

మొత్తంగా కేసీఆర్ ను అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నేతలు వదలబొమ్మాలీ అంటూ ఎన్నికల వేళ కర్రుగాల్చి వాతపెట్టేందుకు సిద్ధమవుతున్నాయ్. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి అటూ ఇటూ ఐతే ఏమవుతుందోనన్న బెంగలో ఉన్న కేసీఆర్ ఏం చేయాలో పాలుపోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుటే కేసీఆర్ కేబినెట్ లో ఉన్న నాలుగురైదుగురు మినహా, మంత్రులందరూ అందరూ ఓడిపోతారన్న ప్రచారం కూడా జోరందుకుంది. కొందరు మాత్రమే తిరిగి గెలుస్తారన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.