Andhra PradeshHome Page Slider

గోదావరిలో దుర్వాసన! యానాం ప్రజల ఆందోళన..

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా యానాం వద్ద వశిష్ట గోదావరి నదిలో దుర్వాసన రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కిలోమీటర్ల మేర అక్కడ గ్యాస్ లీకయి, నదీ జలాలను చీల్చుకుంటూ వస్తోంది. దీనితో గ్యాస్ లీకయి మంటలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని భయాందోళనలకు గురవుతున్నారు. అక్కడ ఓఎన్‌జీసీ పైప్‌లైన్ నుండి క్రూడ్ ఆయిల్ లీక్ అయి నదీజలాలు కలుషితమవడంతో పాటు, ఆ ప్రాంతమంతా దుర్వాసన వస్తోంది. దీనితో అక్కడ మత్స్యకారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ పైప్ లైన్ లీకేజి వల్ల మత్స్య సంపద కనుమరుగు అవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరచూ ఈ లీకేజ్ జరుగుతోందని, స్వచ్ఛమైన మంచినీరు కలుషితమవుతోందని ఫిర్యాదు చేశారు.  దీనితో పుదిచ్చేరి యానాం కాంగ్రెస్ పార్టీ నేతలు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. పైప్ లైన్ లీకేజిపై అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటి వరకూ ఓఎన్‌జీసీ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు.