బాబుకు సిగ్గు లేదు..వాళ్ల అబ్బాయికి పనిలేదు: జోగి రమేష్
ఏపీ రాజకీయాలు రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో అధికార,ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాగా రాష్ట్రంలో ప్రతి పక్షాలు సెల్ఫీలతో అధికార పక్షానికి పలు సవాళ్లు విసురుతున్నాయి. మొన్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కేతిరెడ్డి ఫామ్‌హౌస్‌తో సెల్ఫీ తీసుకొని కేతిరెడ్డికి విసిరిన ఛాలెంజ్‌తో రాజకీయాల్లో కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తూ.. టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు కూడా నిన్న టిడ్కో ఇళ్లతో సెల్ఫీ తీసుకొని సీఎం జగన్‌కు దీనికి జవాబు చెప్పగలవా జగన్ రెడ్డి అని సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ జోగి రమేష్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. మా ప్రభుత్వం నిర్మిస్తున్న 17 వేల జగనన్న కాలనీల పురోగతి చూస్తే బాబుకు గుండె ఆగుతుందన్నారు. ఎవరి హయాంలో ఏం మేలు జరిగిందో కోటిన్నర గడపల వద్దకు వెళ్ళి అడిగే ధైర్యం ఉందా బాబూ..? అని ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాలో టిడ్కో ఇళ్ల మీద చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్స్ చూస్తే.. పిల్ల చేష్టల్లా ఉన్నాయి. 74 ఏళ్ళ వయసులో 44 ఏళ్ళ రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు.. తాను చేయని పనిని, చేసినట్లుగా చెప్పుకుంటూ సెల్ఫీలు దిగటం- దాన్ని ఎల్లో మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం విచిత్రంగానూ, విడ్డూరంగానూ ఉందన్నారు.

మీ హయంలో పునాది దశకే పరిమితమైన టిడ్కో ఇళ్లను మా ప్రభుత్వం వచ్చాక పూర్తి చేసి, మౌలిక సదుపాయలు కల్పిస్తే.. దాన్ని నీవేదో ఉద్ధరించినట్లుగా ప్రచారం చేసుకోవడానికి సిగ్గు ఎక్కడ లేదు అని అడుగుతున్నామన్నారు. టిడ్కో ఇళ్ళు, షేర్ వాల్ టెక్నాలజీ పేరుతో చంద్రబాబు నాయుడు హంగామా చేసి, చివరకు పేదల మీద అప్పు భారం వేస్తే.. మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు ఆ భారాన్ని మొత్తం తగ్గించి పేదవాళ్లకు వాటిని అందించే కార్యక్రమం చేస్తున్నారన్నారు.

చంద్రబాబు నాయుడుకు ఛాలెంజ్ చేస్తున్నా.. ఆయన చేసిన ట్వీట్ కు జవాబు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న ఒక కోటి 50 లక్షల గడపల దగ్గరకు రావడానికి, ఎవరి హయాంలో ఏం మేలు జరిగిందో చర్చించడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడా..? అని సూటిగా ప్రశ్నిస్తున్నామన్నారు. అలానే, మా హయాంలో నిర్మిస్తున్న 17, 005 జగనన్న కాలనీల పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఆ కాలనీలలో లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. ఏ విధంగా కాలనీల్లో ప్రజలు నివాసం ఉంటున్నారో తెలుసుకోవడానికి మాతో పాటు చంద్రబాబు వచ్చినా సరే, లేకుంటే ఆయనతో పాటు మేము అయినా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సవాల్ చేస్తున్నానన్నారు. అయితే దీనిని స్వీకరించే దమ్ము చంద్రబాబుకు ఉందా..? మీ అబ్బాయి నారా లోకేష్ కు పనిపాట లేక రోడ్ల వెంట తిరుగుతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. బస్సు ఎక్కి ఫోటో, ఆటో దగ్గర ఫోటో దిగి పెడుతున్నాడు. మరి 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు సిగ్గులేదా? అని అడుగుతున్నామని జోగి రమేష్ మండిపడ్డారు.


 
							 
							