Home Page SliderTelangana

రాజీమార్గంలో పరిష్కరించుకునేలా కేసులపై అవగాహన కల్పించాలి…

వనపర్తి: జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకుని కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకునేలా కక్షిదారుల్లో అవగాహన కల్పించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.ఆర్.సునీత సూచించారు. ఈ నెల 30న జరిగే జాతీయ లోక్ అదాలత్‌పై పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో శుక్రవారం జిల్లా కోర్టులో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2020లో కోర్టులో పెండింగ్‌లో ఉన్న భార్యాభర్తల కేసును ప్రిలాక్ అదాలత్ ద్వారా పరిష్కరించామన్నారు. పోలీసులు కక్షిదారులతో మాట్లాడి పెండింగ్‌లో ఉన్న కేసులను రాజీమార్గంలో పరిష్కరించేలా చూడాలని, అధిక సంఖ్యలో పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజిని, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రవికుమార్, పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు.