ముఖ్యమంత్రి పై దాడి
ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడికి యత్నించాడు ఓ దుండగుడు. సివిల్ లైన్స్‌లోని అధికారిక నివాసంలో ‘జన్ సున్ వాయ్’ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. 35 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు తెలిపాయి. తొలుత అతడు కొన్ని పేపర్లను సీఎంకు అందించిన తర్వాత ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. సివిల్ లైన్స్‌లోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో బహిరంగ విచారణ సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఒక వ్యక్తి రాయి లాంటి వస్తువుతో ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన సీఎం భద్రతా బృందం, స్థానిక ప్రజలు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన తర్వాత, భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన తర్వాత సంఘటనా స్థలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితుడికి ఏదో ఒక రాజకీయ పార్టీతో సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కూడా ఈ కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సీఎం రేఖ గుప్తాపై జరిగిన దాడిపై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా స్పందించారు. సీఎంపై జరిగిన దాడిని వీరేంద్ర సచ్‌దేవా తీవ్రంగా ఖండించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు.

