పథకం ప్రకారమే ఎంపీ ఇంటిపై దాడి
పథకం ప్రకారమే ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి చేశారన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. బంజారాహిల్స్‌లోని ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసానికి వెళ్లిన ఈటల.. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ… ప్రజల పక్షాన ఉన్నవారిని, ప్రశ్నించే వారిని భయపెట్టడానికి ఈ దాడులు జరుగుతున్నాయన్నారు. నైరాశ్యంతో సహనం కోల్పోయి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, పోలీసులు అండదండాలతో దాడి చేశారని ఆయన దుయ్యబట్టారు.

ఇది మొదటిది కాదు.. బండి సంజయ్ పాదయాత్రలో కూడా దాడులు చేశారన్నారు. మునుగోడు ఎన్నికల్లో భయ భ్రాంతులకు సృష్టించేందుకు రాజగోపాల్‌రెడ్డి మీద దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులపై కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. టీఆర్‌ఎస్ పార్టీని బ్రతికించు కొనే ప్రయత్నంలో భాగమే ఈ దాడులు జరుగుతున్నాయని ఈటల పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఒక మహిళ అయి ఉండి కూడా కొట్టి కొట్టి చంపుతామని మాట్లాడుతుందని ఈటల ఫైర్ అయ్యారు. మేము ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నవాళ్ళమన్నారు. కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. హిట్లర్, ముస్సొలి అనుకుంటున్నారు. వారికి పట్టినగతే ఈయనకు పడుతుందని ఈటల విమర్శించారు.
