Andhra PradeshHome Page Slider

కత్తెర కోసం తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ..

అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీ లీడర్ల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. రాజంపేట అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కత్తెర కోసం టీడీపీ నాయకులు కొట్టుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాజంపేటలోని పాత బస్టాండ్ వద్ద అన్న క్యాంటీన్ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు జగన్ మోహన్ రాజు, రాజంపేట టీడీపీ ఇన్ ఛార్జి సుగవాసి బాలసుబ్రహ్మణం ముఖ్య అతిథులుగా వెళ్లారు. ఈ క్రమంలో రిబ్బన్ కట్ చేయడానికి బాల సుబ్రహ్మణ్యం సిద్ధమయ్యారు. అదే సమయంలో జగన్ మోహన్ రాజు కత్తెర తీసుకుని రిబ్బన్ కట్ చేయడానికి ముందుకొచ్చారు. కానీ జగన్ మోహన్ రాజు చేతిలోని కత్తెర తీసుకుని బాల సుబ్రహ్మణ్యం రిబ్బన్ కట్ చేసి, లోపలికి దూసుకెళ్లారు. క్యాంటీన్ లోపలికి వెళ్లే క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరికి మరొకరు తోసుకుంటూ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా దాడులకు కూడా తెగబడ్డారు. దీంతో అక్కడ తీవ్రమైన ఉద్రిక్తత నెలకొంది. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.