ఢిల్లీ సీఎంగా ఆతిశీ ప్రమాణస్వీకారం
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆప్ నేత ఆతిశీ ప్రమాణస్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. ప్రస్తుతం ఆతిశీ ఆర్థిక, విద్య, పీడబ్ల్యూడీ, రెవెన్యూ సహా పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు.
ఆతిశీ కేబినెట్ లో మంత్రుల ప్రమాణస్వీకారం
కొత్త ముఖ్యమంత్రి ఆతిశీ కేబినెట్ లోకి కొత్త ముఖాలు కనిపించాయి. ఢిల్లీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినవారిలో గోపాల్ రాయ్, కైలాష్ రాయ్, గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్, ముఖేష్ అహ్లావత్ ఉన్నారు. ముఖేష్ అహ్లావత్ సుల్తాన్ పూర్ మజ్రా నుంచి తొలిసారి ఎన్నికయ్యారు. ఇందులో రాయ్, గహ్లాత్, భరద్వాజ్, హుస్సేన్ లు పాతమంత్రులే.. కేజీవాల్ కేబినెట్ లో కూడా మంత్రులుగా ఉన్నారు.
మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొని.. జైలుకు వెళ్లి ఇటీవలే విడుదలై వచ్చిన ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తదుపరి ముఖ్యమంత్రిగా ఆతిశీ పేరును ప్రతిపాదించగా.. ఆప్ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలంటూ ఆతిశీ.. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కోరారు. ఆయన అంగీకరించడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆప్ సిద్ధమైంది. షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్ తర్వాత దిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రిగా ఆతిశీ నిలిచారు. దిల్లీలోని కల్కాజీ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం దిల్లీ ప్రభుత్వంలో ఆమె 14 శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అందులో ఆర్థిక, రెవెన్యూ, విద్య తదితర ముఖ్య శాఖలున్నాయి.

