ఇండోనేషియాలో పడవ బోల్తా, 15మంది మృతి,19 మంది గల్లంతు
ఇండోనేషియాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. పడవ బోల్తా పడిన ఘటనలో 15 మంది మృతి చెందగా, 19 మంది గల్లంతయినట్లు సమాచారం. ఈ ఘటన సుల్వేసి ద్వీపం దగ్గరలోన ఫెర్రీ కాప్సిస్ అనే ప్రాంతంలో జరిగింది. ప్రమాద సమయంలో పడవలో 40 మంది ప్రయాణిస్తున్నారని, వారిలో ఆరుగురిని ఇంతవరకూ కాపాడినట్లు అధికారులు తెలిపారు. వారిని చికిత్సకు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సోమవారం తెల్లవారు జామున జరిగింది. ఇండోనేషియా భద్రతా దళాలు, గల్లంతయిన వారిని గాలిస్తున్నారు. రెండు బృందాలుగా ఈ గాలింపు చర్యలు చేపడుతున్నామని, ఒక బృందం నీటి అడుగున సంఘటనా స్థలంలో గాలిస్తుందని, మరొక బృందం సంఘటనా స్థలానికి దగ్గరలో, చుట్టుపక్కల ఎవరైనా కొట్టుకుపోయారా అని వెదకుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఫెర్రీ అనే ప్రాంతంలో ఇలాంటి పడవ బోల్తాలు అసాధారణం కాదని అక్కడి స్థానికులు పేర్కొన్నారు.

