Home Page SliderNational

శ్రీనగర్‌, లద్ధాక్‌లను కలిపే ఆసియాలోనే అతిపెద్ద “జోజిలా సొరంగం”

కాశ్మీర్ అంటే ఇకమీదట ఉగ్రవాదుల నిలయం కాదు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన అనంతరం  అధునాతన సౌకర్యాలతో పర్యాటకుల స్వర్గధామంగా మారనుంది. శ్రీనగర్, లద్ధాక్‌ల మధ్య దూరాన్ని తగ్గించే ఆలోచనతో ఆసియాలోనే అతిపెద్దదైన జోజిలా టన్నెల్ ఏర్పాటు చేయబోతున్నారు. కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిన కాశ్మీర్, లద్ధాఖ్‌ల మధ్య రవాణాను సులభతరం చేయడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. శ్రీనగర్- లేహ్ హైవేపై కూడా అనేక అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. కాశ్మీర్‌లో ఏకంగా 25 వేల కోట్ల ఖర్చుతో 19 సొరంగాలు నిర్మాణం జరుగుతోంది. దీనిలో ఈ జోజిలా టన్నెల్ చాలా పెద్దది. దీని పొడవు 14.15 కిలోమీటర్లు, ఎత్తు 7.57 మీటర్లు. ఇది గుర్రపు నాడ ఆకారంలో ఉంటుంది. దీనికి 6,800 కోట్ల రూపాయలు వ్యయం అంచనాలు వేస్తున్నారు. దీనిలో 80 కిలోమీటర్ల వేగంతో వాహనాలు నడపవచ్చు.

కాశ్మీర్లోని గాందార్‌బల్, లద్ధాక్‌లోని కార్గిల్ మధ్యలో ఈ జోజిలా పాస్ ఉంది. మామూలుగా రోడ్డుమార్గంలో వెళ్లాలంటే 10 గంటల సమయం పడుతుంది. పైగా వాతావరణం ఎప్పుడూ అనుకూలంగా ఉండదు. ఈ జోజిలా పాస్ మార్గంలో ఎక్కువగా మంచు కురుస్తూ, హిమపాతాలు ఏర్పడుతూ ఉంటాయి. కొండచరియలు విరిగి పడుతుంటాయి. దీనితో వాహనాలు జారి అదుపు తప్పుతుంటాయి.

ఇది కాకపోతే విమాన ప్రయాణమే గతి. సామాన్యప్రజలకు అది భరించలేని ఖర్చు. ఈ టన్నెల్ అందుబాటులోకి వస్తే అన్ని కాలాలలోనూ ప్రయాణం సులువవుతుంది. మిలటరీ వాహనాలకు కూడా చాలా కీలకమార్గం అవుతుంది. ఇది 2026 నాటికి పూర్తవుతుంది. ఈ మార్గంలో స్మార్ట్ పరికరాలు ఉంటాయి. సీసీటీవీలు, రేడియో కంట్రోల్, విద్యుత్ సరఫరా విధానాలు ఉండడం వల్ల ఆర్మీకి, సాధారణ పౌరులకు కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. దేశరక్షణ కూడా సులువవుతుంది.