కాంగ్రెస్ అధ్యక్షపీఠం రేసులో అశోక్ గెహ్లాట్, శశి థరూర్
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అశోక్ గెహ్లాట్ పోటీ చేస్తారంటూ కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయ్. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు సముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అక్టోబర్ 25న ఢిల్లీలో పర్యటించి మరుసటి రోజు నామినేషన్‌ను గెహ్లాట్ దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విదేశాల్లో వైద్య పరీక్షలు చేయించుకుని తిరిగి వచ్చాక… శశిథరూర్‌తో పాటు మరికొంత మందిని కలిసిన కొద్దిసేపటికే ఈ విషయాన్ని పచ్చజెండా ఊపారు.

2019 ఎన్నికల ఓటమి తర్వాత రాహుల్ గాంధీ పదవి నుండి వైదొలగడంతో సోనియా గాంధీ పార్టీ తాత్కాలిక చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. త్వరలో జరగనున్న ఎన్నికలతో కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరన్నది తేలనుందని భావిస్తున్న తరుణంలో ఇద్దరు సీనియర్ నేతలు పోటీకి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం “భారత్ జోడో” యాత్రకు నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ.. ఏఐసీసీ చీఫ్ బాధ్యతలు తీసుకునేందుకు ససేమిరా అనడంతో ఎన్నికకు పార్టీ పెద్దలు రంగం సిద్ధం చేస్తున్నారు.

గాంధీ కుటుంబ విధేయుతను ప్రదర్శిస్తూ పలు రాష్ట్రాల పీసీసీ చీఫ్ లు రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాలంటూ తీర్మానాలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులు కోరిన G- 28 మంది నేతల బృందంలో శశి థరూర్ సభ్యుడు. ఐతే ఎన్నికలపై ఆయన ఓ కన్నేసి ఉంచినట్టు తాజా పరిణామాలను బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
గత వారం, AICC సెంట్రల్ ఎలక్షన్ అథారిటీకి రాసిన లేఖలో ఎన్నికల ప్రక్రియలో “పారదర్శకత మరియు నిష్పాక్షికత” కోరిన నాయకులలో ఆయన కూడా ఉన్నారు. ఓటర్ల జాబితాను బహిరంగపరచాలని కోరిన వారిలో ఆయన కూడా ఉన్నారు.

ఈ ఉదయం థరూర్ యువ పార్టీ సభ్యుల బృందం పునరుద్ధరణ కోసం పిలుపునిచ్చిన పిటిషన్‌పై సంతకం చేశారు. పార్టీ పదవులపై ఐదేళ్ల పరిమితితో పాటు కుటుంబానికి ఒక అభ్యర్థి, ఒక పదవికి ఒక వ్యక్తి వంటి న్యాయమైన ఎన్నికల నియమాలకు కట్టుబడి “ఉదయ్‌పూర్ డిక్లరేషన్” బలపరచాలని కోరారు. రెండేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత వచ్చే నెలలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. మరో మూడు రోజుల్లో అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. కపిల్ సిబల్, జైవీర్ షెర్గిల్, సునీల్ జాఖర్, అమరీందర్ సింగ్, ఆర్‌పిఎన్ సింగ్, అశ్వనీ కుమార్, హార్దిక్ పటేల్‌లతో సహా అనేక మంది కీలక నేతలు గత ఏడాది కాలంగా పార్టీకి గుడ్ బై చెబుతూ వచ్చారు. తాజాగా సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ సైతం పార్టీని వీడారు.

