అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ వర్సిటీగా పేరు మార్చేస్తాం
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు రోజురోజుకు వేడి పెంచుతూ చివరి రోజున మరింత అగ్గిని రాజేశాయి. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మారుస్తూ.. వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, వెంటనే అసెంబ్లీలో బిల్లును ఏకపక్షంగా ఆమోదించటంపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. చంద్రబాబు తనయుడు ఎన్టీఆర్ మనవడు నారా లోకేష్ ఒక రేంజ్ లో మీడియా వేదికగా జగన్‌పై విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ పేరును వైసీపీ ప్రభుత్వం ఎందుకు తొలగించిందో చెప్పాలని… హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ ఏం చేశారని చెప్పాలని ప్రశ్నించారు.

సైకో… సీఎం అయ్యాక మూడు ముక్కలాట మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు. మూడు ప్రాంతాల అభివృద్ధికి జగన్ ఏం చేశారని దుయ్యబట్టారు. ఏపీకి సైకో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని… నాటి నుంచి అన్నింటికీ పేర్లు మారుస్తూ వస్తున్నాడని తెలుగు జాతి ఉన్నంత వరకు అన్న ఎన్టీఆర్ పేరు నిలిచిపోతుందని పేర్కొన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు. కొత్తగా పెడుతున్న మెడికల్ కాలేజీల్లో ఒకదానికి వైఎస్ఆర్ పేరు పెట్టుకోవచ్చని… నిజంగా కేబినెట్ మీటింగ్ జరిగిందా? లేకపోతే పేపర్‌ల పైనే జరిగిందా? అని అనుమానం వ్యక్తం చేశారు. ఇదొక దున్నపోతు ప్రభుత్వమని ముళ్ల కర్రతో కొట్టాలని… ఎన్టీఆర్ కేవలం మాజీ ముఖ్యమంత్రి కాదని ఒక శక్తి అని రాత్రి జగన్ ఏ ఆత్మతో మాట్లాడారో చెప్పాలని పేర్కొన్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక జిల్లాకు, హార్టికల్చర్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు తీయలేదని… మోదీ ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇందిరాగాంధీ పేరు తొలగించలేదని… మండలి ఛైర్మన్ సభ్యులకున్న హక్కులనూ అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. 9 బిల్లులుకు ఎలాంటి చర్చ లేకుండా 9 నిమిషాల్లో పాస్ చేసుకున్నారని ప్రజా సమస్యలపై చర్చిద్దామన్నా వినిపించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రశ్నలకు బదులివ్వలేక సైకో ఐదు రోజులే సమావేశాలు నిర్వహించారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి రాగానే తిరిగి ఎన్టీఆర్ పేరు పెట్టి తీరుతామన్నారు.