అమ్మవారి సాక్షిగా … నేను తప్పు చేయలేదు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రమాణాల రాజకీయం మళ్లీ చర్చనీయాంశమైంది. కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ దుర్గగుడిలో సత్యప్రమాణం చేయటం సంచలనంగా మారింది. “అమ్మవారి సాక్షిగా చెబుతున్నా… నేను ఏ తప్పు చేయలేదు, చేయను కూడా. నా నిష్కళంకతకు సాక్షిగా అమ్మవారే ఉన్నారు” అని వ్యాఖ్యానించారు. “వెంకటేశ్వరస్వామి, దుర్గమ్మ పై ప్రమాణం చేస్తానని ముందే చెప్పాను. ఆ మాటకు కట్టుబడి ప్రమాణం చేశాను” అని వివరించారు.
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి హాజరైన జోగి రమేష్, ఘాట్ రోడ్డు ఎంట్రెన్స్ వద్ద చేతిలో దివ్వె వెలిగించి, “ఈ వ్యవహారానికి నా సంబంధం లేదు” అని అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేశారు. “కల్తీ మద్యం వ్యవహారంలో నన్ను అనవసరంగా లాగి నా వ్యక్తిత్వాన్ని హననం చేశారు. నా హృదయాన్ని గాయపరిచారు” అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని జోగి రమేష్ ఆరోపించారు. “తన కుటుంబాన్ని అవమానపరిచి తన మనసును గాయపరిచిన వారికి అమ్మ మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకున్నాను” అని తెలిపారు.
ఇక కేసు విచారణ కోణంలో జోగి రమేష్ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎందుకంటే కల్తీ మద్యం వ్యవహారంలో నిందితులు “జోగి రమేష్ చెప్పినట్లుగానే చేశాం” అని ఇచ్చిన సమాచారం ఇప్పటికే సంచలనంగా మారింది. దీంతో ఆయన పాత్రపై సీఐడీ దృష్టి సారించింది. అయితే, జోగి రమేష్ మాత్రం తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసేందుకు నార్కో అనాలసిస్ టెస్ట్, లై డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధమని ప్రకటించారు. “నేను తప్పు చేయలేదని అమ్మవారి ఎదుట ప్రమాణం చేశాను. అయితే ఇప్పుడు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఏమంటారు?” అని ప్రశ్నించారు. అలాగే, “నా మీద తప్పుడు ఆరోపణలు చేసిన వారు సత్యప్రమాణానికి సిద్ధమా? లేదా కనీసం లై డిటెక్టర్ టెస్టుకైనా వస్తారా?” అంటూ బహిరంగ సవాల్ విసిరారు.
రాజకీయ ఆరోపణలు, సత్యప్రమాణాలు, నార్కో పరీక్షల మధ్య కల్తీ మద్యం కేసు మరింత రసవత్తరంగా మారింది. ఇక జోగి రమేష్ చేసిన ఈ సత్యప్రమాణం కేసు దర్యాప్తు దిశను మార్చుతుందా? లేదా రాజకీయ ప్రతిస్పందనలకు కొత్త దారి తీస్తుందా? అన్నదానిపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

