హార్మోన్ ఇంజక్షన్స్, గ్రోత్ హార్మోన్‌ల అమ్ముతున్న జిమ్ ట్రైనర్ల అరెస్ట్
హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్‌లోని ఓ జిమ్ ట్రైనర్‌ను ఈరోజు (శుక్రవారం ) టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారితో ఎస్‌ఆర్ నగర్ పోలీసులు, డ్రగ్ కంట్రోల్ టీమ్ కలిసి హార్మోన్ టాబ్లెట్స్, గ్రోత్ ఇంజెక్షన్లు అక్రమంగా అమ్ముతున్న ముగ్గురు వ్యక్తుల ముఠాను పట్టుకున్నారు. ఈ ముగ్గురు కండలు త్వరగా పెరిగేలా, ఎత్తు పెరిగేలా చేసే హార్మోన్లను అక్రమంగా అమ్ముతున్నారు. వీరివద్ద 1,100 టాబ్లెట్స్, 180 ఇంజెక్షన్లు, కాప్యూల్స్ సుమారు లక్ష రూపాయల విలువచేసే మందులను స్వాధీనం చేసుకున్నారు. అమిర్‌పేటలోని ఓంప్రకాశ్ ప్రొటిన్ సప్లిమెంట్లు వ్యాపారం చేస్తూ, అంబర్ పేటకు చెందిన నరేశ్, చంద్రాయణగుట్టకు చెందిన జిమ్ ట్రైనర్‌తో కలిసి ఈ అక్రమ వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

యువకులలో కండలు పెరగాలనే బలహీనతను వారు కనిపెట్టి, అటువంటి వారిని మభ్యపెట్టి ఈ మందులు వారికి అమ్మజూపుతున్నారు. మొదట్లో తక్కువ రేటులో అమ్ముతూ క్రమంగా ధరలు పెంచుతూ లాభాలు ఆర్జిస్తున్నారు. వీరికి నగరంలో అనేక మంది వ్యాపారస్తులతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. వీరిలో బేగంపేట్‌కు చెందిన జిమ్ ట్రైనర్ సయ్యద్ ఫారుఖ్, విశాఖకు చెందిన అవినాశ్ అనే వ్యక్తికి సంబంధాలున్నాయని తెలుసుకున్నారు. అవినాశ్ పరారీలో ఉన్నారు. వీరు స్వాధీనం చేసుకున్న మందులను, వ్యక్తులను ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో తదుపరి విచారణ కోసం అప్పగించారు.

