Andhra PradeshHome Page Slider

లోకేష్ పాదయాత్ర షురూ

• ఉదయం 11.03 గంటలకు తొలి అడుగు
• కుప్పంలో నియోజకవర్గం లో మూడు రోజులు యాత్ర
• మొదటిరోజు పాదయాత్రలో నందమూరి బాలకృష్ణ

ఏపీలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మొదలుపెట్టనున్న పాదయాత్ర ప్రారంభమయ్యింది. షెడ్యూల్ ప్రకారం నేటి నుంచి మూడు రోజులపాటు కుప్పం నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగిస్తారు. 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర మార్గంలో వివిధ వర్గాల ప్రజా సమస్యలను ఆయన అడిగి తెలుసుకోనున్నారు. నేటి ఉదయం 11.03 గంటలకు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభమయ్యింది. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్‌ను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. మొదటి రోజు కుప్పం మున్సిపాల్టీ లక్ష్మీపురంలో మధ్యాహ్నం 12 గంటలకు పూజ కార్యక్రమాలు నిర్వహించి కుప్పం పట్టణం వైపు యాత్ర ప్రారంభమవుతుంది. బాబు నగర్, పాతపేట, మసీదులో ప్రార్థనలు నిర్వహించి కుప్పం బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడే ఉన్న ఆటో కార్మికులతో మాట్లాడి పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. బహిరంగ సభలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఏరియా ఆసుపత్రి తంజామ్మ కొట్టాలు, చిన్న శెట్టిపల్లి, నలగంపల్లి, పీఏఎస్ వైద్య కళాశాల వరకు యాత్ర కొనసాగుతుంది. రాత్రికి అక్కడే బస చేస్తారు. మొదటి రోజు సుమారు ఎనిమిది కిలోమీటర్ల లోకేష్ నడవనున్నారు.

ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా సాదాసీదాగా ఉండేలా పాదయాత్ర ఏర్పాట్లు చేస్తున్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసింది. వందలాదిమంది పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోనున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాదయాత్రను విజయవంతం చేయటానికి ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నారు. గురువారం నారా లోకేష్ తిరుమలకు చేరుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్న అనంతరం నేరుగా కుప్పంకు చేరుకున్నారు. రాష్ట్రంలోని 125 నియోజకవర్గాలలో లోకేష్ పాదయాత్ర సాగే దిశగా ఆ పార్టీ యంత్రాంగం రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. ప్రతి నియోజకవర్గంలో కనీసం మూడు రోజులు యాత్ర ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. లోకేష్ పాదయాత్రకు సంబంధించి కీలక బాధ్యతలను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం అప్పగించింది. తొలి రోజు పాదయాత్రలో బాలకృష్ణ తన అల్లుడు లోకేష్‌తో కలిసి పాల్గొననున్నారు. ఇప్పటికే పాదయాత్రను విజయవంతం చేసేందుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసింది. ప్రతి నియోజకవర్గంలో పార్టీ కోఆర్డినేటర్లను నియమించడంతోపాటు పర్యవేక్షణకు రాష్ట్రస్థాయి నేతలను నియమించింది. ఇదే సమయంలో లోకేష్ పాదయాత్రలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటంతో పాటు తరచూ పాల్గొనాలని బాలకృష్ణకు చంద్రబాబు సూచించినట్లు తెలుస్తుంది.