InternationalNews

మయన్మార్‌ స్కూల్‌పై సైన్యం కాల్పులు.. విద్యార్థుల మృతి

మయన్మార్‌లో సైనిక హెలికాప్టర్‌ నుంచి జరిపిన కాల్పుల్లో ఓ స్కూల్‌లో 13 మంది చనిపోయారు. ఈ ఘోరం సగాయింగ్‌ ప్రాంతంలోని లెటెయెట్‌ కోన్‌ గ్రామంలో జరిగింది. తిరుగుబాటుదారులు తలదాచుకున్నారనే అనుమానంతో మయన్మార్‌ సైనికులు హెలికాప్టర్‌ నుంచి బౌద్ధ ఆశ్రమం ఆవరణలోని ఓ స్కూలు భవనంపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు సహా 13 మంది మృతి చెందగా.. 30 మంది గాయపడినట్లు తెలిసింది.

కాల్పులు జరిపినప్పుడు ఆ స్కూల్‌లో 240 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఆ గ్రామంలోని 2 వేల మంది ప్రాణభయంతో ఊరొదిలి పారిపోయారు. తిరుగుబాటుదారులు కాల్పులు జరిపారని, తాము జరిపిన ఎదురు కాల్పుల్లో రెబెల్స్‌తో పాటు విద్యార్థులు చనిపోయారని సైన్యం ప్రకటించింది. గతేడాది ప్రజాప్రభుత్వాన్ని కూల్చేసి సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పటి నుంచి దేశంలో హింసాకాండ ఎక్కువైంది.