Andhra PradeshHome Page Slider

సంక్రాంతి పండక్కి ఊరెళ్తున్నారా… దొంగలతో జర జాగ్రత్త

వృత్తి, వ్యాపార రీత్యా, పిల్లల చదువుల కోసం స్వగ్రామాన్ని వదిలి వుండే వారు, జీవనోపాధి కోసం వచ్చి వుండే వారు, సంక్రాంతి పండగ వేళ ఇంటికి తాళం వేసి తమ స్వగ్రామాలకు వెళ్లి, ఆనందోత్సాహాలతో పండగ జరుపుకుని తిరిగి ఇంటికి వచ్చే సరికి ఇంట్లో దొంగతనం జరిగి బీరువాలో దాచుకున్న సొమ్ములు, బంగారు నగలు దోచుకుని పోవడం ఇంటి యజమానులు తీవ్ర ఆందోళనకు గురి కావడం జరుగుతుంటుంది. కావున పండగకు తమ ఊర్లకు వెళ్ళే ప్రతి ఒక్కరుపలు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు. సంక్రాంతి పండుగకి ఊరికి వెళ్లాలనుకునేవారు సాధ్యమైనంతవరకు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళకుండా, ఇంటి వద్ద ఎవరో ఒకరు ఉండేలా చూసుకోవాలి. విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.

ఒకవేళ ఇంటివద్ద ఎవరిని ఉంచే పరిస్థితి లేకపోతే, పక్క ఇంటివారినైనా తమ ఇంటి వైపు చూడమని చెప్పాలి. పోలీస్ వారికి కూడా సమాచారం ఇవ్వాలి.
ఊరికి వెళ్లేముందు ఇంటిలో ఎక్కువ మొత్తంలో నగదు/ బంగారు ఆభరణాలు ఉంచకుండా జాగ్రత్త వహించాలి. వీలైతే బ్యాంకు లాకర్ లో నగదును, బంగారు ఆభరణాలను దాచుకుని వెళ్ళాలి.బ్యాంక్ లాకర్ లేని వారు నమ్మకం ఉన్న బంధువులు లేదా స్నేహితుల వద్ద ఉంచి వెళ్ళాలి. పండుగల వేళ బస్ స్టేషన్లు కిక్కిరిసి ఉండటం సహజం. ఆ సమయంలో బస్సు ఎక్కే క్రమంలో దొంగలు మీ పక్కన తోసుకుంటూ వెళ్లి మీ పాకెట్ లో ఉన్న డబ్బులు, మొబైల్ ఫోన్లు కొట్టివేయడం, మహిళల మెడలో నుండి బంగారు గొలుసులు తెంపుకొని పారిపోవడం చేస్తుంటారు. కావున బస్సు ఎక్కే సమయంలో మిమ్మల్ని తోసుకుంటూ వెళ్లే వారితో పాటు మీ విలువైన వస్తువుల మీద దృష్టి సారించాలి.


కొంతమంది తమ విలువైన బంగారు ఆభరణాలు, నగదు ఉన్న బ్యాగ్, పర్సును, సంచిని లేదా సూట్ కేస్ లను బస్సు సీట్ లో ఉంచి, నీళ్ల బాటిల్ కొనుక్కోవడానికి, వాష్ రూమ్ కి వెళ్లడానికి లేదా టీ తాగి రావడానికి బస్సు సీట్ లో బ్యాగును వదిలి వెళ్తుంటారు. బస్సు సీటు బ్యాంకు లాకర్ కాదనే విషయం గుర్తుంచుకోవాలి. అలా బ్యాగ్ వదిలి వెళ్ళిన వారు తిరిగి వచ్చేసరికి బస్సు సీటు లో తాము పెట్టిన తమ విలువైన ఆభరణాలు గల నగదు ఉన్న బ్యాగు మాయమైపోయే ప్రమాదం పొంచి ఉంది. సీటుపై ఆశ మొదటికే మోసం తెచ్చే అవకాశం ఉంది. కావున అప్రమత్తంగా ఉండవలెను. ప్రతి పండుగకు పోలీస్ లు పలు సూచనలు ఇచ్చినప్పటికీనీ, కొంతమంది నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యం వహించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్ల పలుమార్లు దొంగతనాలు జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉంటే ఎలాంటి సమస్యలు రావు, కావున పోలీసుల సూచనలు పాటించండి మీ ఇల్లు భద్రంగా ఉంచుకోండి.