News

హైదరాబాద్ నిజాం క్లబ్‌ ఫుడ్ తింటున్నారా? ఐతే ఇక అంతే సంగతులు?

నిబంధనలు ఉల్లంఘిస్తోన్న నిజాం క్లబ్
ఆహారం భద్రతా నిబంధనలను ఉల్లంఘన
చెల్లుబాటయ్యే లైసెన్స్ లేదంటున్న అధికారులు
తనిఖీల్లో విస్తుగొలిపే అంశాలు

కల్తీ కల్తీ కల్తీ.. ఇప్పుడు ఏది చూసిన కల్తీ. దేశ వ్యాప్తంగా ఆహార పదార్థాల విషయంలో జరుగుతున్న కల్తీలు, అపరిశుభ్రత వినియోగదారులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో ఫేమస్ నిజాం క్లబ్ నిబంధనలు పాటించడం లేదని అధికారుల పర్యవేక్షణలో తేలింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు సెప్టెంబర్ 24, 2024న హైదరాబాద్‌లోని చారిత్రాత్మక నిజాం క్లబ్‌ను తనిఖీ చేయడంతో విస్తుపోయారు. 1884 నాటి, అసఫ్ జాహీ రాజవంశానికి చెందిన నవాబ్ మహబూబ్ అలీ ఖాన్ స్థాపించిన క్లబ్ ఆహారపదార్థాల వినియోగంలో ఉల్లంఘనలను టాస్క్‌ఫోర్స్ గుర్తించింది. నిజాం క్లబ్ నడిపేందుకు చెల్లుబాటు అయ్యే FSSAI లైసెన్స్ లేదని అధికారులు గుర్తించారు. రెండోది, అవసరమైన కొన్ని రికార్డులు ఏవీ కూడా లేకపోవడంతో అసలేం జరుగుతుందని ఆరా తీయగా ఒక్కో విషయం బయటకు వచ్చింది.

వీటిలో ఫుడ్ హ్యాండ్లర్‌లకు మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, క్లబ్ ప్రాంతంలో పెస్ట్ కంట్రోల్ రికార్డ్‌లు, ఆహార తయారీకి ఉపయోగించే RO నీటికి సంబంధించిన వాటర్ అనాలిసిస్ రిపోర్ట్స్‌లో అవకతవకలున్నట్టు అధికారులు నిర్ధారించారు. వంటగది అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించారు. ఇష్టారాజ్యాంగా బొద్దింకలు, పైకప్పు నుండి నీరు కారడం, విరిగిన రిఫ్రిజిరేటర్ తలుపులు తుప్పు పట్టడం, క్లబ్ పరిసరాల్లో నీళ్లు నిలిచిపోవడం వంటి అనేక లోపాలను అధికారులు గుర్తించారు. అంతేకాదు కొన్ని ఆహార పదార్థాలను లేబుల్ లేకుండా నిల్వ ఉంచడం వాటి చుట్టూ బొద్దింకలు తిరగడాన్ని చూశారు. ఆవరణలోని స్టోర్ రూమ్‌లో ఉంచిన గోధుమ పిండి, మినపప్పులో ఈగలు, పురుగులను అధికారులు పరిశీలించారు. కొన్ని డస్ట్‌బిన్‌లు తెరిచి ఉంచడమే కాదు, వాటికి సరైన మూతలూ లేకపోవడాన్ని గమనించారు. అంతే కాదు. వంటకాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడినట్లు, చెఫ్స్ అంగీకరించడం విశేషం.

అదే రోజు, అబిడ్స్‌లోని ఎల్‌బీ స్టేడియంలోని ఫతే మైదాన్ క్లబ్‌ను టాస్క్‌ఫోర్స్ తనిఖీ చేసింది. ఓపెన్ డస్ట్‌బిన్‌లు, కీటకాలను నిరోధించే స్క్రీన్‌లు లేని కిటికీలు, జిడ్డుగల గోడలు, విరిగిన టైల్స్‌, రిఫ్రిజిరేటర్‌లోని లేబుల్ లేని ఆహారంతో సహా అనేక సమస్యలను అధికారులు గమనించారు. వంటగదిలో వంట వండేవారు… హెయిర్ క్యాప్స్, గ్లోవ్స్, అప్రాన్‌లు ధరించలేదని అధికారులు చెప్పారు. అదనంగా, హ్యాండ్లర్‌లకు మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, ఆహార తయారీకి ఉపయోగించే RO నీటికి సంబంధించిన వివరాలు లేకపోవడం విశేషం. ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ సెప్టెంబర్ 21, 2024న నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లోని పాన్ షాపులను తనిఖీ చేసింది. 5 వాణిజ్య సముదాయాల్లో 4కి “ఎలాంటి చెల్లుబాటు అయ్యే FSSAI రిజిస్ట్రేషన్ లేకుండా పనిచేస్తున్నట్లు గుర్తించారు” అని బృందం వెల్లడించింది.