టాలీవుడ్‌లో ఇంత స్వార్ధపరులున్నారా..?
తెలుగు సినీ పరిశ్రమ స్వార్ధపరులతో నిండిపోయిందా..? ఇక్కడి వాళ్లు తమ లాభం చూసుకోవడం మినహా.. ఇతరులను పట్టించుకునే పరిస్థితిలో లేరా..? తెలుగు సినీ పరిశ్రమను ఓ ఊపు ఊపిన వెటరన్ హీరోలనూ పట్టించుకునే తీరిక వాళ్లకు లేదా..? కనీసం.. దిగ్గజ నటుడు కృష్ణం రాజు మృతికి సంతాపంగా ఒక్క రోజు షూటింగ్‌ను ఆపాలన్న కనీస జ్ఞానం టాలీవుడ్ ప్రముఖులకు లేదా..? ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్ ఇప్పుడు సినీ పరిశ్రమ నైతికతకు పెద్ద సవాల్‌గా నిలిచింది.

కృష్ణంరాజుకు నివాళి అర్పించే టైం లేదా..
‘భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు.. తదితర అత్యంత గొప్ప చిత్రాల్లో నటించిన మహా నటుడు, గొప్ప నిర్మాత కృష్ణం రాజు చనిపోతే.. సంతాప సూచకంగా కనీసం ఒక్క రోజు సినిమా షూటింగ్‌ను ఆపాలన్న ఆలోచన కూడా వారికి రావడం లేదా..? అత్యంత స్వార్ధపూరితంగా మారిన తెలుగు సినిమా పరిశ్రమకు నా జోహార్లు. కనీసం మన చావుకైనా విలువ ఉండాలంటే.. కృష్ణం రాజు వంటి పెద్ద మనిషికి విలువ ఇద్దాం. ఆయన మృతికి సంతాపంగా కనీసం రెండు రోజులు షూటింగ్‌ను ఆపుదాం. డబ్బు ఖర్చు ఎక్కువ అవుతోందని నెల రోజులు షూటింగ్‌లు ఆపేసిన తెలుగు సినీ పరిశ్రకు కృష్ణం రాజుకు నివాళి అర్పించే తీరిక లేదా..?’ అంటూ రాంగోపాల్ వర్మ తీవ్ర ఆవేదనతో ట్వీట్ చేశారు.

మన మీద మనమే ఉమ్మేసుకున్నట్లు..
‘కృష్ణ గారికి, మురళీ మోహన్ గారికి, చిరంజీవి గారికి, మోహన్‌బాబు గారికి, బాలయ్యకు, ప్రభాస్‌కు, పవన్ కళ్యాణ్‌కు.. నేను మనవి చేసేదేమిటంటే.. రేపు మీలో ఎవరికైనా ఇదే దుస్థితి తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది’ అని టాలీవుడ్ ప్రముఖులందరినీ హెచ్చరించారు.

కొందరి గుప్పిట్లోనే టాలీవుడ్..
రాంగోపాల్ వర్మ ఆవేదనను చూస్తుంటే.. మన టాలీవుడ్‌లో నిర్మాతల నుంచి ప్రారంభిస్తే.. జూనియర్ ఆర్టిస్టు వరకూ అందరికీ డబ్బులు తప్ప గొప్ప వాళ్లను గౌరవించడం.. విలువలు పాటించడం.. సమాజానికి తన వంతు సాయం చేయడం.. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం.. వంటి లక్షణాలేవీ లేవని తెలుస్తోంది. అంతేకాదు.. సినీ పరిశ్రమ కొంతమంది గుప్పిట్లోనే ఉందని.. ‘ఆ నలుగురు’ ఆడించినట్లు సినీ పరిశ్రమ ఆడుతోందనే విమర్శలు వస్తున్నాయి. సినీ వారసులకు తప్ప కొత్త వారికి ఇక్కడ చోటు లేదనే ఆరోపణలు సైతం ఉన్నాయి.

టాలీవుడ్‌ను ప్రక్షాళన చేయాలి..
సినిమా థియేటర్లపై కొందరి గుత్తాధిపత్యం నడుస్తోందని.. కొత్త వారు ఎన్నో కోట్లు ఖర్చు చేసి ఓ సినిమా తీస్తే.. వారికి థియేటర్లు దొరకకుండా సిండికేట్ అవుతారని.. ఆ కొత్త వారు మళ్లీ టాలీవుడ్ ముఖం చూడకుండా చేస్తారనే అపవాదు కూడా ఉంది. అయితే.. వీటికి వ్యతిరేకంగా గళం విప్పేందుకు ఎవరూ ధైర్యం చేయడం లేదు. ఎప్పుడో ఒకప్పుడు, ఎవరో ఒకరు ధైర్యం చేసి సినీ పరిశ్రమకు వ్యతిరేకంగా గళం విప్పితే.. ఆయన అంతు చూసే వరకూ.. సినీ పరిశ్రమ నుంచి పారిపోయే వరకూ వెంటాడతారనే ప్రచారం ఉంది. టాలీవుడ్‌పై ప్రజల్లో ఉన్న ఇలాంటి అపవాదు తొలగిపోవాలంటే.. సినీ పరిశ్రమను ప్రక్షాళన చేసేందుకు.. విలువలు, సాంప్రదాయాలు పాటించేందుకు టాలీవుడ్ ఉద్ధండులు నడుం బిగించాలి.