మునుగోడులో మనీ పాలిటిక్స్‌దే పైచేయి..!
మునుగోడులో మూడు ప్రధాన పార్టీలూ తమ అభ్యర్థులను ప్రకటించాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె స్రవంతి పోటీ చేస్తున్నారు. వెనుకబడిన వర్గాల ప్రజలు 90 శాతానికి పైగా ఉన్న మునుగోడులో కనీసం ఒక్కసారి కూడా వెనుకబడిన వర్గానికి చెందిన నాయకుడు ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు. ఇక్కడ ఎన్నికలు జరిగిన 12 సార్లూ అగ్ర కులానికి చెందిన వారే విజయం సాధించారు.

ఓసీ ఓటర్లు 10 శాతం లోపే..
మునుగోడులో మొత్తం ఓటర్ల సంఖ్య 2,27,267 మంది. అందులో కొత్తగా ఓటర్లుగా నమోదైన వారు 20,181 మంది ఉన్నారు. ఈ ఓటర్లలో పురుషులు 1,15,625.. మహిళలు 1,11,637 మంది ఉన్నారు. ఇక వర్గాల వారీగా చూస్తే.. బీసీ ఓటర్లు 1,50,400 (66.2 శాతం), ఎస్సీలు 35,411 (15.6 శాతం), ఎస్టీలు 13,000 (3.5 శాతం), మైనారిటీలు 8000 (3.5 శాతం) మంది ఉన్నారు. ఓసీ ఓటర్లు మాత్రం 20,290 (8.9 శాతం) మందే ఉన్నారు.

90 శాతానికి పైగా వెనుకబడిన వర్గాల వారు..
66.2 శాతం ఉన్న బీసీ ఓటర్లలో గౌడ కులస్తులు 38,000 (16.7 శాతం), గొల్ల, కురుమలు 35,000 (15.4 శాతం), ముదిరాజ్‌లు 34,500 (15.2 శాతం), పద్మశాలీలు 19,000 (8.4 శాతం), వడ్డెరలు 8300 (3.6 శాతం), విశ్వ బ్రాహ్మణులు 7800 (3.4 శాతం), కుమ్మరులు 7800 (3.4 శాతం) మంది ఉన్నారు. 15.6 శాతం ఉన్న ఎస్సీ ఓటర్లలో మాదిగలు 25000 (11 శాతం), మాలలు 10411 (4.6 శాతం) మంది ఉన్నారు. 8.9 శాతం మాత్రమే ఉన్న ఓసీ ఓటర్లలో రెడ్డి 7701 (3.3 శాతం), కమ్మ 4,880 (2.1 శాతం), వెలమ 2,360 (1.0 శాతం), వైశ్య 3,760 (1.6 శాతం), ఇతరులు 1,589 (0.9 శాతం) మంది మాత్రమే ఉన్నారు.

రెడ్డి, వెలమలదే రాజ్యం..
మునుగోడులో ఇప్పటి వరకు 12 సార్లు ఎన్నికలు జరిగితే 8 సార్లు రెడ్డి, నాలుగు సార్లు వెలమ సామాజిక వర్గం వారే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (కాంగ్రెస్), 2014లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (టీఆర్‌ఎస్), 2009లో యు.యాదగిరిరావు (సీపీఐ – వెలమ), 2004లో పల్లా వెంకట్‌రెడ్డి (సీపీఐ), 1999లో పాల్వాయి గోవర్ధన రెడ్డి (కాంగ్రెస్), 1994లో యు.నారాయణరావు (సీపీఐ – వెలమ), 1989లో యు.నారాయణరావు (సీపీఐ – వెలమ), 1985లో యు.నారాయణరావు (సీపీఐ – వెలమ), 1983లో పాల్వాయి గోవర్ధన రెడ్డి (కాంగ్రెస్), 1978లో పాల్వాయి గోవర్ధన రెడ్డి (కాంగ్రెస్), 1972లో పాల్వాయి గోవర్ధన రెడ్డి (కాంగ్రెస్), 1967లో పాల్వాయి గోవర్ధన రెడ్డి (కాంగ్రెస్) ఎన్నికయ్యారు.

వెనుకబడిన వర్గాల ఓట్లే కీలకం..
ఈ సమీకరణాలను పరిశీలిస్తే.. గత 60 ఏళ్లుగా 5 శాతం లోపు ఉన్న రెడ్డి, వెలమ వర్గాలకు చెందిన వారే మునుగోడులో రాజ్యమేలుతున్నారు. ఏది ఏమైనా 90 శాతానికి పైగా ఉన్న వెనుకబడిన వర్గాల ఓటర్లే ఇక్కడ కీలకం కానున్నారు. అందులోనూ 16.7 శాతం ఉన్న గౌడ కులస్తులు, 15.4 శాతం ఉన్న గొల్ల, కురుమలు, 15.1 శాతం ఉన్న ముదిరాజ్‌లు నిర్ణయాత్మక శక్తిగా మారనున్నారు. 11 శాతం ఉన్న మాదిగలు కూడా అభ్యర్థి గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నారు.

మనీ పాలిటిక్స్‌లో కొట్టుకుపోయారు..
అయినా.. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వంటి ప్రధాన పార్టీలు వెనుకబడిన వర్గాల వారికి టికెట్లు ఇచ్చే ధైర్యం చేయకపోవడానికి ప్రధాన కారణం వారు ఆర్థికంగా బలమైన శక్తులుగా లేకపోవడమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ధైర్యం చేసి వెనుకబడిన వర్గాల వారికి టికెట్ ఇస్తే.. మరో పార్టీకి చెందిన అగ్రవర్ణ అభ్యర్థి వెదజల్లే డబ్బుల ప్రవాహంలో కొట్టుకుపోతాడనే భయం ప్రధాన పార్టీల్లో నెలకొందని చెబుతున్నారు. మొత్తానికి.. మనీ పాలిటిక్స్‌లో సామాజిక వర్గ సమీకరణాలు కొట్టుకుపోయాయని చెప్పొచ్చు.

