యువతకు మార్గదర్శకం ఆరా..
ఆరా అంటేనే ఓ స్ఫూర్తి. ఆరా అంటేనే ఓ చైతన్యం. అలాంటి స్పూర్తిని, చైతన్యాన్ని ఇస్తూ యువతలో నిబిడీకృతమైన ప్రతిభను వెలికి తీసేందుకు ఆరా ఫౌండేషన్ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని వక్తలు ప్రశంసించారు. ఆరా పౌండేషన్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా మద్దిరాలలో నిర్వహించిన రాష్ట్రస్ధాయి క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమానికి నర్సరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ శాసన సభ్యులు మర్రి రాజశేఖర్ తదితరులు హాజరయ్యారు.

ఈరోజుల్లో ఎంత సంపాదించాం.. ఏం చేస్తున్నాం అన్నది ప్రధానం కాదని .. సమాజానికి ఏం చేశాం అన్నదే ప్రధానమని అన్నారు మాజీ శాసనసభ్యులు మర్రి రాజశేఖర్. సేవాభావాన్ని పుణికి పుచ్చుకుని, యువతలో చైతన్య దీప్తులను రగిలిస్తున్న ఆరా పౌండేషన్ సేవలను కొనియాడారు. మానసిక వికాసానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని, యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంచుతున్న ఆరా ఫౌండేషన్ చైర్మన్ షేక్ మస్తాన్ ని మనస్ఫూర్తిగా అభినందించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు మాట్లాడుతూ మద్దిరాల గ్రామం ఓ స్ఫూర్తి నింపుతోందని అన్నారు. యువతను వ్యసనాల బారిన పడనివ్వకుండా క్రీడలపై ఆసక్తిని పెంచుతోందని అన్నారు. క్రికెట్ పోటీలలో గెలుపొందిన జట్లకు బహుమతులను అందజేశారు. మొదటి బహుమతి కింద లక్ష రూపాయలు నగదుతో పాటు జ్ఞాపికను అందజేశారు. ద్వితీయ బహుమతి కింద 75 వేల రూపాయలు, తృతీయ బహుమతిగా 50 వేల రూపాయలు, నాల్గవ బహుమతి కింద 25 వేల రూపాయలు అందజేశారు. కాగా ఈ పోటీలలో ఆరా క్రికెట్ టీం ద్వితీయ బహుమతిని గెలుచుకుంది.


