Home Page SliderInternational

కనీవినీ ఎరుగని రీతిలో ‘యాపిల్’ సీఈవో వేతనం తగ్గింపు

షేర్ హోల్డర్ల అభిప్రాయాన్ని గౌరవించి, యాపిల్ సీఈవో  టిమ్‌కుక్ తన వేతనాన్ని తగ్గించుకోవడానికి స్వచ్చందంగా ముందుకు వచ్చారు. మార్చి 10న జరగబోయే ఇన్వెస్టర్ డేలో ఈ విషయానికి వాటాదారుల అనుమతి లభించాలి. 2022లో టిమ్‌కుక్ 99 మిలియన్ డాలర్ల వేతనాన్ని అందుకున్నారు. కాగా ఈ సంవత్సరం దీనిని 49 మిలియన్ డాలర్లకు తగ్గించాలని భావిస్తున్నారు షేర్‌హోల్డర్లు. దీనికి ఆయన అంగీకరించినట్లు తెలిసింది. కంపెనీ ఉన్నతోద్యోగుల వేతనాలకు సంబంధించిన సంస్థాగత వాటాదారుల నుండి తీవ్ర ఒత్తిడి వల్ల ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని కంపెనీ తెలిపింది.

వాటాదారులంతా ఓటింగ్ రూపంలో తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. కుక్ పనితీరును మాత్రం కంపెనీ బోర్డు ప్రశంసించింది. ఆయన దీర్ఘకాల వ్యూహాలతో కంపెనీ అభివృద్ధి చేస్తున్నారని, ఆయనపై సంపూర్ణ విశ్వాసం ఉన్నట్లు తెలిపింది. ఆయనకు ఇప్పటివరకూ 83 మిలియన్ డాలర్ల స్టాక్ అవార్డు, 12 మిలియన్ డాలర్ల ప్రోత్సాహకాలు, 3 మిలియన్ డాలర్ల మూలవేతనం లభిస్తున్నాయి. అంతేకాక పదవీవిరమణ పరిహారం, సెక్యూరిటీ, వ్యక్తిగత విమాన ప్రయాణం, విహార యాత్రల కోసం కూడా 46 వేల డాలర్ల నగదును చెల్లిస్తున్నారు. ఇప్పుడు వీటన్నింటిలోనూ కోత పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే రిటైర్‌మెంట్ నాటికి లభించే స్టాక్ అవార్డ్స్ కూడా తగ్గించబడతాయి.