Home Page SliderNational

ఢిల్లీ మేయర్‌గా అప్ నేత షెల్లీ ఒబెరాయ్ ఎన్నిక

ఢిల్లీ మేయర్‌గా అప్ నేత షెల్లీ ఒబెరాయ్ ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థిని 34 ఓట్ల తేడాతో ఆమె ఓడించారు. ఒబెరాయ్‌కు 150 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాకు 116 ఓట్లు వచ్చాయి. మొత్తం 266 ఓట్లు పోలయ్యాయి. హోరాహోరీగా సాగిన ఎన్నికల తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్ అత్యున్నత పీఠాన్ని అందుకున్నారు. ఢిల్లీ మేయర్ ఎన్నిక జరిపేందుకు ఇప్పటి వరకు కార్పొరేటర్లు మూడు సార్లు సమావేశమయ్యారు. అయితే బీజేపీ, ఆప్ మధ్య రచ్చ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయాలతో గత కొద్ది రోజులుగా గందరగోళం నెలకొంది. మేయర్ ఎన్నిక కోసం మూడుసార్లు విఫలయత్నాల తర్వాత, సుప్రీంకోర్టుతో ఆప్‌కి కీలక విజయం లభించింది. లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన 10 మంది సభ్యులకు ఎన్నికల్లో ఓటు హక్కును అనుమతించడంపై ఆప్ మేయర్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. “గూండాలు ఓడిపోయారు, ప్రజానీకం గెలిచింది. ఈరోజు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఢిల్లీ ప్రజలు గెలిచారు, గూండాయిజం ఓడిపోయింది” అని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఒబెరాయ్‌ను పార్టీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.