Andhra PradeshHome Page Slider

ఏపీలో ఎంసెట్‌ ఫలితాలు విడుదల

ఏపీలో ఇవాళ 2022-23 సంవత్సరానికి మే నెలలో నిర్వహించిన ఏపీఈఏపీ సెట్‌ ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో అనంతపురం జేఎన్‌టీయూ యూనివర్సిటీ అధికారులతో కలిసి మంత్రి ఫలితాలు వెల్లడించారు. ఇంజినీరింగ్‌లో 76.32 శాతం ఉత్తీర్ణత, అగ్రికల్చర్‌లో 89.65 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి వివరించారు. ఇంజనీరింగ్ విభాగంలో చల్ల ఉమేష్ వరుణ్‌కు 158 మార్కులతో మొదటి ర్యాంక్.. బూరుగుపల్లి సత్య రాజా జస్వంత్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 153 మార్కులతో మొదటి ర్యాంక్ సాధించాడని తెలిపారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఏపీఈఏపీ సెట్‌కు మార్చిలో నోటిఫికేషన్‌ ఇచ్చామని, ఈ పరీక్షలకు 3,39,739 మంది పరీక్షలకు హాజరయ్యారని మంత్రి బొత్స తెలిపారు. ఇందులో ఇంజినీరింగ్‌కు 2.38 లక్షల మంది దరఖాస్తు చేశారని, అగ్రికల్చర్‌కు 1,00,559 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. ఇంజినీరింగ్‌కు మే 17 నుంచి 19 వరకు, అదే విధంగా అగ్రికల్చర్‌కు మే 28, 29వ తేదీల్లో పరీక్షలు జోన్లుగా విభజించి 136 సెంటర్లలో పరీక్షలు నిర్వహించామని అన్నారు. ఇంజినీరింగ్‌కు సంబంధించి విద్యార్థులు 2,24,724 మంది, అగ్రికల్చర్‌లో 90,574 మంది మొత్తంగా 94 శాతం మంది పరీక్షలు రాశారని మంత్రి వివరించారు.ఈ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ cets.apsche.ap.gov.in వెబ్‌సైట్‌లో విడుదల చేశారు. కోవిడ్ సమయంలో తొలగించిన ఇంటర్ వెయిటేజ్ మార్కులను ఈసారి పరిగణలోకి తీసుకుని ఫలితాలను ప్రకటించారు.