Andhra PradeshNews

సమస్యల సుడి.. విమర్శల జడి

ఎన్నికల సైరన్ మోగేందుకు ఇంకా చాలా సమయం ఉంది. కానీ.. రాజకీయాలు మాత్రం వేడెక్కాయి. ఎవరికి ఎవరూ తగ్గడం లేదు. నోటి జోరును పెంచుతున్నారు. ఏం మాట్లాడుతున్నాం అన్నది కూడా మరచి విమర్శలను ఎక్కు పెడుతున్నారు. మాంచి దూకుడును ప్రదర్శిస్తే గానీ వచ్చే ఎన్నికల్లో నెగ్గలేమని ఒకరి భావన. చేసిన పనులే మళ్ళీ గెలిపిస్తాయని మరొకరి ధీమా. కొత్త ఎత్తులతో పొత్తులతో అధికార పార్టీకి చెక్ పెట్టాలని ఇంకొకరి యోచన. ఈ పరిణామాలే ఇప్పుడు ఏపీ రాజకీయాలపై ఆసక్తిని పెంచుతున్నాయి. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. విపక్షాలకు ఏ చిన్న అవకాశం దొరికినా వదలకుండా దుమ్ము దులిపేస్తున్నాయి. అధికార పార్టీ నేతల తీరుపై వెలుగు చూస్తున్న అంశాలను అస్త్రాలుగా మలుచుకుని విమర్శల శరాలను సంధిస్తున్నాయి. సామాజక మాధ్యమాలలో సైతం అగ్గి పుట్టిస్తున్నాయి. దీనికి తోడు సర్కార్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు వివాదంగా మారుతున్నాయి.


ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర గడువుంది. సర్వేలు స్వరాన్ని సవరించాయి. లెక్కలు కట్టి .. గెలుపుపై అంచనాలు వేశాయి. ఏవో కొన్ని సీట్లు తగ్గినా మళ్ళీ విజయం వైసీపీదే అంటూ జోస్యం చెప్పేశాయి. దీంతో అధికార పార్టీలో ధీమా పెరిగింది. గతంలో వచ్చిన 151 సీట్ల కంటే ఇంకా మెరుగైన విజయం సాధించడంపై అప్పుడే వ్యూహాలు మొదలయ్యాయి. విపక్ష పార్టీలకు తమను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకే చవకబారు విమర్శలకు దిగుతున్నారని వైసీపీ నేతలు మండి పడుతున్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజాకర్షక పథకాలను చూసి ఓర్వలేక జనం దృష్టిని మళ్ళించే పనులకు పాల్పడుతున్నారని ఎదురుదాడికి దిగుతున్నారు. ఎన్ని రకాలుగా కుయుక్తులు పన్నినా మళ్ళీ మాదే విజయం అంటూ అధికార వైసీపీ ఢంకా బజాయిస్తోంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలపై అప్పుడే పార్టీ నేతలకు జగన్ మార్గ నిర్దేశనం కూడా చేస్తున్నారు. అయితే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీకి సీట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నప్పటికీ .. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం మళ్ళీ గెలుపు వైసీపీదే అన్న సంకేతాలు కూడా ఇస్తున్నాయి. ఈ క్రమంలో తమ బలాన్ని పెంచుకుని .. అన్ని స్ధానాల్లో గెలవాల్సిందేనంటూ జగన్.. పార్టీ నేతలకు టార్గెట్ ఫిక్స్ చేస్తున్నారు. 175 నియోజకవర్గాలకు సంబంధించిన అన్ని అంశాలను అధ్యయనం చేస్తున్నారు


విపక్ష పార్టీలు కూడా దూకుడును పెంచాయి. వైసీపీ నేతలు అనుసరిస్తున్న విధానాలు, ఆ పార్టీ నేతలపై వస్తున్న విమర్శలు, వెలుగు చూస్తున్న ఆరోపణలు తమకు కలిసి వచ్చే అంశాలుగా తెలుగుదేశం, జనశక్తి పార్టీలు భావిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీపై కనిపించని వ్యతిరేకత ఉందని.. అన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని విపక్షాలు భావిస్తున్నాయి. ఆయా అంశాలపైనే గురిపెట్టి కార్యాచరణను రూపొందిస్తున్నాయి. ఇక హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న విపక్షాలు .. అతనిపై చర్యలు తీసుకునే వరకు వదిలేదే లేదంటూ ఆందోళనకు దిగాయి. అలాగే ఇటీవల దళితులపై పెరుగుతున్న దాడులపై కూడా స్వరాన్ని పెంచాయి. విదేశీ విద్యా పథకానికి ఉన్నఅంబేద్కర్ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ మంగళగిరిలో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగింది. డాక్టర్ సుధాకర్, డాక్టర్ అనితారాణిపై వేధిపులు.. అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకున్నందుకు వరప్రసాద్ పై దాడి వంటివి వైసీపీ నేతల అహంకార ధోరణికి నిదర్శనాలుగా పేర్కొంటూ ఆందోళన చేపట్టింది టీడీపీ.


అటు జనసేన, బీజేపీలు కూడా అనేక సమస్యలపై గళం విప్పుతున్నాయి. ఆందోళనలు సాగిస్తున్నాయి. వైసీపీ విధానాలను ఎండగడుతున్నాయి. ఉచితాల పేరుతో తాయిలాలు పంచడం తప్పించి ఎక్కడా అభివృద్ధి అన్నదే లేదని జనశక్తి అంటోంది. ముఖ్యంగా రోడ్ల పరిస్ధితి ప్రమాదకరంగా మారినా పట్టించుకునే వారే కరవయ్యారని జనసైనికులు ఆరోపిస్తున్నారు. అయితే విపక్షాలు చేస్తున్న విమర్శలపై వైసీపీ కూడా ధీటుగానే స్పందిస్తోంది. పలు సందర్భాలలో విమర్శలు వ్యక్తిగత దూషణలకు దారితీస్తున్నాయి. సభ్యత మరచి .. సంస్కారం వీడి .. హోదాను పక్కనబెట్టి పరుష పదజాలంతో వ్యక్తిగత విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. కొందరికి ఇవి వినోదాన్ని పంచినా.. ఎక్కువ శాతం మంది మాత్రం నేతల తీరుపై మండి పడుతున్నారు. ఇప్పుడు ఉపాధ్యాయుల విషయంలో సర్కార్ తీసుకున్న నిర్ణయంపై కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.


ఇప్పటి వరకు అమలులో ఉన్నబయో మెట్రిక్, ఐరిస్ విధానానికి బదులు ప్రస్తుతం ఫేషియల్ రికగ్నిషన్‌ సిస్టమ్ అమలులోకి తీసుకు వచ్చారు. ఇందుకోసం సిమ్స్‌-ఏపీ అనే మొబైల్‌ యాప్‌ను రూపొందించడంతో పాటు టీచర్లు సహా స్కూళ్లలో పనిచేసే సిబ్బంది మొత్తం ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఏపీ విద్యాశాఖ ఆదేశించింది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ లు లేని ఉపాధ్యాయులు ఏం చేయాలని, యాప్ లో వాళ్లు ఎలా ఫోటో అప్ లోడ్ చేస్తారని ప్రశ్నిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంటర్ నెట్ సమస్య ఉంటుందని.. అలాంటి ప్రాంతాల్లో యాప్ వినియోగం కష్టమవుతుందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ఫేషియల్ రికగ్నిషన్‌ సిస్టమ్ అమలుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు వివాదంగా మారింది. విపక్షాలు కూడా దీన్ని తప్పుబడుతున్నాయి. పాఠశాల విద్యను పేదలకు దూరం చేసే కుట్ర జరుగుతోందని జనసేన ఆరోపించింది. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ సంస్ధలకు అప్పగించే కుట్రలో భాగమే ఈ సంస్కరణలు అంటూ జనసేన దుయ్యబట్టింది. ఇప్పటికే ప్రాధమిక పాఠశాలలు మూతపడ్డాయని, ఉపాధ్యాయులను వేధించి వదిలించుకునేందుకు జరుగుతున్న కుట్రలో భాగమే సిమ్స్‌-ఏపీ అని జనసేన ఆరోపించింది.


ఇక మూడు రాజధానుల అంశంపై ప్రభుత్వం పట్టుదలతో ఉంది. అమరావతి రైతులు కూడా పట్టు వీడడం లేదు. పోలీసులను ప్రయోగించినా.. కేసులు పెట్టినా .. వారి ఆందోళనలు ఆగడం లేదు. తిరుమలకు పాదయాత్ర నిర్వహించారు. వికేంద్రీకరణ బిల్లును సర్కార్ వెనక్కి తీసుకున్నా.. మూడు రాజధానుల విషయంలో వెనకకి తగ్గబోమని జగన్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రైతులు మరో ఉద్యమానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వారు చేపట్టిన ఆందోళన వెయ్యి రోజులకు చేరుతున్న సందర్భంగా అమరావతి నుండి అరసవెల్లి వరకు పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయంలో రైతులను టీడీపీయే రెచ్చగొడుతోందన్న భావన వైసీపీలో బలంగా ఉంది. ఈ పరిణామాల నేపధ్యంలో ఎవరి పావులు.. వారు కదుపుతున్నారు. ఎవరి వ్యూహాలు.. వారు రచిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఈ ఆందోళనలన్నీ తమకు కలిసి వస్తాయని టీడీపీ, జనసేనలు లెక్కలు వేస్తుంటే.. వైసీపీ మాత్రం అదేం లేదని .. తిరిగి పీఠం తమదే అంటూ ధీమాను వ్యక్తం చేస్తోంది. అయితే ఈ వ్యవహారాలన్నీ ఏపీలో హీట్ ను పెంచుతున్నాయి. చల్లారని అగ్గి లానే మండుతున్నాయి. చూద్దాం.. భవిష్యత్ లో ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తారో. ఎవరు తిరిగి పగ్గాలు చేపడతారో. సర్వేలు చెప్పినవే నిజమవుతాయా ? లేక ప్రజలు భిన్నంగా ఆలోచించి స్పందిస్తారా ? కాలం ఇచ్చే సమాధానం కోసం ఎదురు చూద్దాం.