కొత్త కొత్త కార్యక్రమాలతో ప్రజల వద్దకు.. పార్టీలు
ఏపీ పొలిటిక్స్ రసవత్తరంగా మారాయి. కొత్త కొత్త కార్యక్రమాలతో ప్రజలను ముంచెత్తుతున్నాయి. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు తొమ్మిది నెలల ముందే సందడి మొదలయ్యింది. వ్యూహ ప్రతి వ్యూహాలలో జనయాత్రలు, అభ్యర్థుల ఎంపిక కసరత్తులకు అధికార, ప్రతిపక్ష పార్టీలు తెరలేపాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన ఎదుర్కోవటానికి అన్ని పార్టీలు సమర సన్నాహాల్లో మునిగితేలుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళుతుండటం పాలకపక్షం వైసీపి కూడా జనంలోకి వెళ్ళటానికి సన్నద్దమవుతోంది. తెలుగుదేశం పార్టీ మహానాడులో ప్రకటించిన ప్రాథమిక మేనిఫెస్టోను ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రలు చేయాలని నిర్ణయించి నిర్వహిస్తోంది. నెలరోజుల పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్రలో జరిపి మేనిఫెస్టోకు మంచి ప్రచారం కల్పించడం ఈ యాత్రల ఉద్దేశం.

సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవల తమ పార్టీ ఎమ్మెల్యేలతో తాడేపల్లిలో వర్క్ షాప్ నిర్వహించారు. ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం కింద నెల రోజులపాటు ఇంటింటికి తిరగాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. జనంలో తిరగకపోతే ఈసారి టికెట్లు ఇవ్వనని హెచ్చరించారు. ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని వైసీపీ నిర్వహించగా ‘బాదుడే బాదుడు’, ‘ఇదేం కర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ నిర్వహించింది. నారా లోకేష్ గత నాలుగు నెలలుగా విరామం లేకుండా పాదయాత్ర జరుపుతున్నారు.

చంద్రబాబు నాయుడు కూడా జిల్లాలను చుట్టేస్తున్నారు. రాజమండ్రి మహానాడుకు ముందు ఆయన ప్రతివారం ఒక జిల్లాలో పర్యటించి రోడ్డు షోలు బహిరంగ సభలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా గత కొంతకాలంగా పర్యటనల జోరు పెంచారు. వివిధ సంక్షేమ పథకాలకు నిధులు విడుదల పేరుతో ఏదో ఒక నియోజకవర్గంలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. తమ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 18 మంది పనితీరు బాగోలేదని ముఖ్యమంత్రి జగన్ బహిరంగంగా వ్యాఖ్యానించారు.

అధికార ప్రతిపక్షాలకు దీటుగా జనసేన కూడా ఎన్నికల కసరత్తులు మొదలుపెట్టింది. వారాహి పేరుతో ప్రత్యేక ప్రచార వాహనం తయారు చేయించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన పర్యటనలు ప్రారంభించారు. బహిరంగ సభలకే పరిమితం కాకుండా మార్గమధ్యంలో వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తూ హామీలతో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మూడు ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో పనిచేయడంతో పాటు సామాజిక మాధ్యమాల్లో కూడా బలం చాటటానికి గట్టి ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం వారి పోరాటం డిజిటల్ రంగానికి కూడా విస్తరించింది. పరస్పర విమర్శలు ఎదుటివారిపై ఎత్తిపొడుపులు, వ్యంగ్యాస్త్రాలతో సామాజిక మాధ్యమరంగం ఇప్పటికే కోలాహారంగా మారింది. మరి ఎన్నికల నాటికి ప్రజలు ఏ పార్టీకి మద్దతు ఇస్తారో వేచి చూడాల్సి ఉంది.