మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో ఏపీ మంత్రి పర్యటన
మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ పర్యటిస్తున్నారు. మహారాష్ట్రలోని పింప్రీ చించివాడ్ మున్సిపల్ కార్పొరేషన్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ని మంత్రి నారాయణ, అధికారులు సందర్శించారు. ప్రతి రోజూ చెత్త నుంచి 14 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్లాంట్‌లో విద్యుత్‌తో పాటు బయోగ్యాస్‌నూ ఉత్పత్తి చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ప్లాంట్ పనితీరు, విద్యుత్ వినియోగంపై మంత్రి నారాయణకు పింప్రీ చించివాడ్ కార్పొరేషన్ అధికారులు వివరించారు. ఏపీలో త్వరలో కొత్తగా రెండు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌లను నెలకొల్పుతున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ప్లాంట్‌ల పరిశీలన ద్వారా బెస్ట్ మోడల్‌ను ఎంపిక చేయడంలో భాగంగా పర్యటిస్తున్నానని మంత్రి నారాయణ వివరించారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌లు, చెత్త నిర్వహణ విధానాలను పరిశీలిస్తామని చెప్పుకొచ్చారు. మంత్రి నారాయణతో పాటు ప్లాంట్‌ల సందర్శనకు స్వచ్చంద్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులు వెళ్లారు.