చంద్ర బాబు క్షమాపణలు చెప్పే వరకు నిరసనలు
ఎర్రగొండపాలెం లో శాంతియుత వాతావరణాన్ని చంద్రబాబు నాయుడు కలుషితం చేశాడని రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. దళితులను కించపరిచి తప్పించుకుని తిరగాలనుకుంటే చంద్రబాబును వదిలేది లేదని హెచ్చరించారు. రాళ్ల దాడికి పాల్పడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. నేషనల్ హైవేపై ట్రాఫిక్ అంతరాయం కల్పించినందుకు చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్లు జండా కర్ర తిప్పుతుంటే ఆ పార్టీ కార్యకర్త కంటికి గాయమైతే తమపై అభాండాలు వేయటం సబబు కాదన్నారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రాంతానికి వచ్చి వాహనం లోపల నుంచి చంద్రబాబు బయటికి వచ్చి దళితులకు వేలు చూపించి బెదిరించాడని మంత్రి ఆరోపించారు. దళిత సంఘాల ప్రతినిధులను బెదిరిస్తూ తెలుగుదేశం పార్టీ అల్లరి మూకలను రెచ్చగొట్టి రాళ్లదాడి చేయించాడన్నారు. దళితుల వ్యతిరేక భావజాలం చంద్రబాబు డిఎన్ఏ లోనే ఉందని మంత్రి మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పేవరకు తమ నిరసనలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.