Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

ప్రజా సంక్షేమంలో ఏపీ నే నెంబర్ 1

ప్రజా సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏలూరులో జరిగిన ‘పేదల సేవ’ కార్యక్రమంలో స్పష్టం చేశారు. గత 18 నెలల్లో కేవలం సామాజిక భద్రతా పింఛన్లకే రూ.50,000 కోట్లకు పైగా ఖర్చు చేయడం దీనికి నిదర్శనమని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఉంగుటూరులో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న నాగలక్ష్మి ఇంటికి స్వయంగా వెళ్లి పింఛన్ అందజేసిన ఆయన, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పింఛన్ల పంపిణీకే రూ.50,763 కోట్లు ఖర్చు చేశామని, సంక్షేమం కోసం దేశంలో ఎలాంటి రాష్ట్రం కూడా ఈ స్థాయి వ్యయం చేయడం లేదని చెప్పారు. ఐదేళ్లలో పింఛన్లకే రూ.1.65 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని, పొరుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో ఖర్చు చేయడం లేదని వివరించారు. ప్రస్తుతం 63 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు ప్రతినెలా రూ.2,739 కోట్లు పంపిణీ చేస్తున్నామని, వారిలో 59 శాతం మహిళలేనని, ఇప్పటివరకు పంపిణీ చేసిన రూ.50,000 కోట్లలో రూ.30,000 కోట్లు మహిళలకే చేరాయని తెలిపారు. ఈ నెల కొత్తగా 7,533 మంది వితంతువులకు పింఛన్లు మంజూరు చేయడం ద్వారా అదనంగా రూ.3 కోట్ల భారం పడుతుందని చెప్పారు. గత ప్రభుత్వంలో ఒక నెల పింఛన్ తీసుకోకపోతే కూడా రద్దు చేసే నియమాన్ని మార్చి, రెండు నెలలు తీసుకోని 1.39 లక్షల మందికి రూ.114 కోట్లు, మూడు నెలలు తీసుకోని 13,325 మందికి రూ.16 కోట్లు విడుదల చేశామని చెప్పారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్.టి.ఆర్ ప్రారంభించిన పింఛన్ పథకాన్ని దశలవారీగా విస్తరించి ప్రస్తుతం రూ.4,000 అందిస్తున్నామని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రతినెలా ఒకటో తేదీనే పింఛన్ అందించే బాధ్యతను నిబద్ధంగా కొనసాగిస్తున్నామని అన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి లక్ష్యాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి చిన్నారికి ‘తల్లికి వందనం’ కింద ఏటా రూ.15,000 అందిస్తున్నామని, ఎన్నికల్లో హామీ ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు. ‘దీపం-2’ కింద ఏటా మూడు సిలిండర్లను ఉచితంగా అందించి ఇప్పటివరకు 2.85 కోట్లు పంపిణీ చేశామని, ఇందుకు రూ.2,104 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా ఇప్పటివరకు 25 కోట్ల మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేసినట్లు వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయులను నియమించామని తెలిపారు. దేశ–రాష్ట్రాల ప్రగతికి జనాభా సమతుల్యత అత్యంత కీలకమని, జనాభా క్షీణత ఆందోళన కలిగించే అంశమని, దీన్ని సమతుల్యం చేయడం భవిష్యత్తులో అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుందని అన్నారు.