ఏపీ డిప్యూటీ సీఎం పవనా మజాకా.. 9 నెలల మిస్సింగ్ కేసును వారంలో ఛేదించిన పోలీసులు
పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగానే కాకుండా పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి & తాగునీటి సరఫరా మరియు పర్యావరణ, అటవీశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వరుస సమీక్షలతో ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు.అంతేకాకుండా పవన్ పరిపాలనలో తన మార్క్‌ను చూపించే విధంగా ప్రజల వద్దకే పాలన అన్నట్లుగా ప్రజా దర్బార్ కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల పవన్ మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసు వద్ద రోడ్డు మీద కూర్చోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో ఓ మహిళ తన కుమార్తె కనిపించడం లేదని పవన్‌కు ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేసినప్పటికీ వాళ్లు పట్టించుకోవడం లేదని ఆమె వాపోయారు. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ వెంటనే ఆమె కుమార్తె జాడను కనుగొనాలని పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు ఈ మిస్సింగ్ కేసును పోలీసులు తాజాగా చేధించారు. ఏపీలో మిస్సయిన ఆ యువతిని పోలీసులు జమ్మూలో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆ యువతి రామవరప్పాడుకు చెందిన యువకుడితో కలిసి జమ్మూ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. డిప్యూటీ సీఎం చొరవతో 9 నెలల తర్వాత యువతి ఆచూకీ లభ్యమైనట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు యువతి,యువకుడిని విజయవాడ తరలిస్తున్నారు.

