తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి సిఐడి
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చిన సిఐడి అధికారులు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పేరుతో నోటీసులు ఇచ్చి వెళ్లారు. పార్టీ అనుబంధ పత్రిక చైతన్య రథంలో వస్తున్న వార్త కథనాలపై సిఐడి వివరాలు సేకరించింది. ఇంతకు చైతన్య రథం పత్రిక ఎడిటర్ ఎవరు, నిర్వహణ ఎవరు చూస్తున్నారు అంటూ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి ప్రశ్నలు వేశారు. అనంతరం కార్యాలయంలో ఉన్న పార్టీ న్యాయవాది చేతికి నోటీసులు అందజేసి సిఐడి అధికారులు వెళ్లిపోయారు. చైతన్య రథం పేరుతో తెలుగుదేశం పార్టీ డిజిటల్ మ్యాగజైన్ నడుపుతోంది.రోజు దాదాపు 24 పేజీలతో వచ్చే ఈ మ్యాగజైన్ ద్వారా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వార్తా విశేషాలను సభ్యులకు చేరవేస్తారు. అలాగే అధికార పక్షం చేస్తున్న అక్రమ వ్యవహారాలపై పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించేందుకు మ్యాగజైన్లో కథనాలు ప్రచురిస్తున్నారు.ఈ క్రమంలో రెండు నెలల క్రితం రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి గురించి అపరిచితుడు అనే శీర్షికను బుగ్గన భూదాహం అనే ఒక శీర్షికతో కథనం ప్రచురితమైంది.ఇందులో బుగ్గన ఆస్తులు గురించి ప్రచురించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రిటర్నింగ్ అధికారికి ఇచ్చిన అఫడవిట్ ను తీసుకొని ఆస్తుల పై కథనం ప్రచురించారంటూ చైతన్య రథంపై కేసు నమోదు చేశారు. మంత్రి బుగ్గనను అప్రతిష్ట కలిగించే విధంగా గౌరవ మర్యాదలకు బంధం కలిగించారంటూ సెక్షన్ లో నమోదు చేశారు. ఈ కేస్ కు సంబంధించి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న సిఐడి అధికారులు సిఆర్పిసి లోని సెక్షన్ 91 కింద నోటీసులు ఇచ్చారు. చైతన్య రథం పత్రిక ఎడిటర్ ఎవరు నిర్వహణ ఎవరు చూస్తున్నారని అలాగే అపరిచితుడు అనే పేరుతో ఈ కథనాన్ని రాసిన రిపోర్టర్ ఎవరని చైతన్య రథం డిజిటల్ మ్యాగజైన్ కు సంబంధించి ఒరిజినల్ కాపీ అందజేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మూడు నెలల క్రితమే శీర్షికపై కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పుడు నేరుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి నోటీసులు అందజేయడం గమనార్హం.