కీలక అంశాలపై ఏపీ కేబినెట్ నిర్ణయాలు
• పనితీరు సరిగా లేని మంత్రుల మార్పు
• క్యాబినెట్ భేటీలో సీఎం జగన్
•ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల బిల్లుకు కేబినెట్ ఆమోదం
•హైస్కూళ్ళల్లో 5330 నైట్ వాచ్ మ్యాన్‌ల నియామకానికి గ్రీన్ సిగ్నల్
•దేవాలయాల్లో పని చేస్తున్న నాయి బ్రాహ్మణులకు నెలకు రూ.20వేలు కమిషన్
ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది మంత్రులు మార్పు కనిపించడం లేదని సొంత శాఖలపై కూడా పట్టు సాధించలేకపోతున్నారని అసలు వారి శాఖల పరిధిలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయటం లేదని ఇలా అయితే చాలా కష్టమని అవసరమైతే పనిచేయని మంత్రులను మార్చేసి ఆ స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తానంటూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పలువురు మంత్రులను ఉద్దేశించి క్యాబినెట్ మీటింగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మంగళవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాక మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ సచివాలయం మొదటి బ్లాకులో మంత్రివర్గ సమావేశం జరిగింది. సుదీర్ఘంగా మూడు గంటలకు పైగా సాగిన మంత్రివర్గ భేటీలో వివిధ అంశాలపై సీఎం జగన్ చర్చించినట్లు తెలుస్తోంది. 45 అంశాలకు సంబంధించి ఈ సందర్భంగా ఆమోదం కూడా తెలిపారు.

మూడు రాజధానుల వ్యవహారంపై కూడా సీఎం పలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు కూడా తెలుస్తోంది. మూడు రాజధానులు వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో ముందుగా క్యాంపు కార్యాలయాన్ని విశాఖకు తరలించాలని సీఎం జగన్ గతంలోకి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే మంత్రివర్గం సహచర మంత్రులతో విశాఖ అంశాన్ని మరోసారి చర్చించినట్లు తెలుస్తోంది. జూలై నుండి క్యాంపు కార్యాలయాన్ని విశాఖకు తరలించి వారంలో రెండు రోజులు అక్కడ నుంచి పాలను చేపట్టాలని ఆ దిశగా మంత్రులంతా సిద్ధంగా ఉండాలని చెప్పినట్లు తెలుస్తోంది. క్యాబినెట్ మీటింగ్‌లో ఆమోదించిన అంశాలను సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు తెలిపారు విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం కావటం పై ముఖ్యమంత్రి జగన్ కు మంత్రులు అభినందనలు తెలిపారని అభినందనల తీర్మానాన్ని ధర్మాన ప్రసాదరావు ప్రవేశ పెట్టారని ఆయన తెలిపారు.

పెన్షన్లను ఏప్రిల్ 3వ తేదీన పంపిణీ చేయనున్నామని, ఏప్రిల్ ఒకటిన ఆర్బీఐ సెలవు, రెండో తేదీన ఆదివారం కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని, ఆస్కార్ అవార్డు సాధించిన నాటు నాటు పాట బృందానికి ముఖ్యమంత్రి క్యాబినెట్‌లో అభినందనలు తెలిపారని పేర్కొన్నారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా కమిషన్ కాల పరిమితిని మూడేళ్ల నుంచి రెండేళ్ళకు తగ్గించాలని క్యాబినెట్ నిర్ణయించిందన్నారు. మీడియా ప్రతినిధులకు అక్రిడేషన్ సదుపాయం కొనసాగింపునకు ఆమోదం తెలిపిందని, జిల్లా గ్రంథాలయాల సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్ళకు పెంచారని, ఎయిడెడ్ ప్రైవేటు విద్యాసంస్థల్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్ళకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

హైస్కూళ్ళల్లో నైట్ వాచ్ మ్యాన్ ల నియామకానికి ఆమోద ముద్ర పడిందని నెలకు ఆరు వేల రూపాయల గౌరవ వేతనం అందిస్తారని, టాయిలెట్ నిర్వహణ నిధి నుంచి చెల్లించే విధంగా నిర్ణయం తీసుకున్నారని, ఏపీఐఐసీ చేసిన 50 ఎకరాల లోపు కేటాయింపులను క్యాబినెట్ ర్యాటిఫై చేసిందని తెలిపారు. అమలాపురం కేంద్రంగా అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు కు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని ఏపీ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం బిల్లు – 2023 కు ఆమోదం తెలిపిందని ఎక్సైజ్ చట్టం సవరణకు ఆమోదం తెలిపిందన్నారు. ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్టు -1987 ప్రకారం అన్ని దేవ స్థానాల బోర్డులలో ఒక నాయీ బ్రాహ్మణుడ్ని సభ్యుడిగా నియమించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు. దేవాలయాల్లో క్షుర కర్మలు చేస్తున్న నాయి బ్రాహ్మణులకు కనీసం నెలకు రూ.20వేలు కమిషన్ అందించాలన్న ప్రతిపాదనకు , పట్టాదార్ పాస్ బుక్స్ ఆర్డినెన్స్ 2023 సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తెలిపారు.