చైనాకు అమెరికా మరో ఝలక్, అరుణాచల్ ప్రదేశ్‌పై ఆశలు వదులుకోండి…
అరుణాచల్ ప్రదేశ్‌ను భారత భూభాగంగా గుర్తించండి
చైనాకు తేల్చి చెప్పిన అమెరికా విదేశాంగ శాఖ
అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్ అంటూ కాకమ్మ కబుర్లు చెప్పొద్దు
ప్రధాని పర్యటనలపై అభ్యంతరాల నేపథ్యంలో అమెరికా కీలక వ్యాఖ్యలు
అరుణాచల్ ప్రదేశ్‌ను భారత భూభాగంగా అమెరికా గుర్తిస్తుందని, వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగే చర్యలను వ్యతిరేకిస్తామని అమెరికా స్పష్టం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి వెళ్లిన తర్వాత చైనా సైన్యం తీరును అమెరికా ఖండించింది. ఈ వారం ప్రారంభంలో, చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి సీనియర్ కల్నల్ జాంగ్ జియోగాంగ్ మాట్లాడుతూ, జిజాంగ్ దక్షిణ భాగం.. అంటే అరుణాచల్ భూభాగం, చైనాలో అంతర్భాగమని… బీజింగ్ ఎప్పుడూ అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగమని అంగీకరించబోదని చెప్పారు. అయితే చైనా మాత్రం అరుణాచల్ విషయంలో పాత వాదనను పదేపదే విన్పిస్తూనే ఉంది.

ఇండియా ముఖ్యనేతల పర్యటనలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటుంది. ఈ ప్రాంతానికి జంగ్నాన్ అని చైనా పేరు పెట్టి.. ఇండియాపై దురాక్రమణ చేసైనా ఆ స్థలాన్ని తమలో విలీనం చేసుకోవాలని డ్రాగన్ దేశం స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కుటిల యత్నాలు చేస్తూనే ఉంది. మార్చి 9న, ప్రధాని మోదీ అరుణాచల్ ప్రదేశ్‌లో 13,000 అడుగుల ఎత్తులో నిర్మించిన సెలా టన్నెల్‌ను జాతికి అంకితం చేశారు. ఇది వ్యూహాత్మకంగా ఉన్న తవాంగ్‌కు అన్ని వాతావరణ కనెక్టివిటీని అందిస్తుంది. సరిహద్దు ప్రాంతంలో సైనికుల మెరుగైన కదలికను ఎప్పటకప్పుడు సమాచారం తెలుసుకునేందుకు, స్పందించేందుకు వీలు కలుగుతుంది. బుధవారం తన రోజువారీ విలేకరుల సమావేశంలో విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ డిప్యూటీ స్పోక్స్‌పర్సన్ వేదాంత్ పటేల్ మాట్లాడుతూ, “అరుణాచల్ ప్రదేశ్‌ను అమెరికా, భారత భూభాగంగా గుర్తిస్తుంది, చొరబాట్లు లేదా ఆక్రమణలు, సైనిక లేదా పౌరుల ద్వారా వాస్తవ నియంత్రణ రేఖ వద్ద ప్రాదేశిక సమగ్రతకు విరుద్ధంగా ఏ ఏకపక్ష ప్రయత్నాలను ఆమోదించం” అని చెప్పారు.

మరోవైపు అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా ప్రాదేశిక వాదనలను భారతదేశం పదేపదే తిరస్కరించింది. అరుణాచల్ దేశంలో అంతర్భాగమని పేర్కొంది. ఆ ప్రాంతానికి సొంత పేర్లు పెట్టుకోడాన్ని తీవ్రంగా వ్యతిరేకించే భారత్, ఇప్పుటికే చైనాకు ఇందుకు సంబంధించి నిరసన కూడా తెలిపింది. ఆయా ప్రాంతాలకు పేర్లను మార్చి పెట్టడం వల్ల వాస్తవి స్థితిగతులు మారబోవని పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్ భూభాగంపై చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి “అసంబద్ధమైన వాదనలు” చేసిన తాజా వ్యాఖ్యలను గుర్తించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అరుణాచల్ ఇండియాలో భాగంగా ఉంది. ఇకపైనా ఉంటుంది. ఎల్లప్పుడూ ఉంటుందని నొక్కి చెప్పింది. అరుణాచల్ భారతదేశంలో విడదీయరాని భాగమని పేర్కొంది.

