Home Page SliderNational

కాశ్మీరు లోయలో మరో అద్భుత కట్టడం..ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి

రైలు మార్గం ద్వారా కాశ్మీరును భారత్‌లోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించే ప్రక్రియలో వేగం పెరిగింది. కాశ్మీరులోయలో మరో అద్భుత కట్టడం రూపుదిద్దుకుంది. ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వేబ్రిడ్జి వాడుకలోకి రాబోతోంది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఈ ఎత్తైన రైల్వేబ్రిడ్జిని చీనాబ్ నదీ గర్భం నుండి 359 మీటర్ల ఎత్తులో నిర్మించారు. దీని పొడవు 1315 మీటర్లు.  పారిస్‌లోని ప్రపంచ వింత ఐఫిల్ టవర్ కన్నా 30 మీటర్ల ఎక్కువ ఎత్తులో ఈబ్రిడ్జి నిర్మాణం జరిగింది. దీని ద్వారా రాంబన్ నుండి రియాసికి రైలు సర్వీసులు త్వరలో ప్రారంభం అవుతాయి. ఇప్పటి వరకూ ప్రపంచంలోని ఎత్తైన వంతెనగా ఉన్న చైనాలోని బెయిపాన్ నదిపై ఉన్న షుబాయ్ రైల్వే వంతెన 275 మీటర్ల పొడవును ఇది అదిగమించింది. ఇది ప్రపంచంలోనే 8 వ వింతగా నిలువబోతోందని, దేశీయ ఇంజనీర్ల ప్రతిభకు అద్దం పడుతోందని రియాసి డిప్యూటీ కమిషనర్ పేర్కొన్నారు.