మరో 16,940 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్
తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఊపందుకుంది. ఇటీవల 9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ఆర్థిక శాఖ తాజాగా మరో 16,940 ఉద్యోగాల భర్తీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇప్పటి వరకు 60,929 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వివిధ శాఖల ఉన్నతాధికారులు, టీఎస్పీఎస్సీ చైర్మన్‌తో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసే దిశగా ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోందని వివరించారు.

గ్రూప్స్ నోటిఫికేషన్ల జారీకి కసరత్తు..
డిసెంబరు నెలలో గ్రూప్ 2, 3, 4 నోటిఫికేషన్లు జారీ చేసే దిశగా టీఎస్‌పీఎస్సీ తీవ్ర కసరత్తు చేస్తోంది. వీటికి సంబంధించి ఆర్థిక శాఖ ఇప్పటికే అనుమతి ఇవ్వడంతో భర్తీ ప్రక్రియకు రూట్ క్లియర్ అయింది. గ్రూప్-2లో 726 ఉద్యోగాలు.. గ్రూప్-3లో 1,373 ఉద్యోగాలు, గ్రూప్-4లో 9,168 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఇప్పటికే గ్రూప్-1, పోలీస్, వైద్యారోగ్య శాఖ, అసిస్టెంట్ ఇంజనీరింగ్ తదితర పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. పోలీస్, గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు కూడా పూర్తయ్యాయి. సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాలకు డిసెంబరు 8వ తేదీన దేహదారుఢ్య పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.

