Home Page SliderNational

కార్గిల్ విజయగాథకు పాతికేళ్లు..అమర జవాన్లకు మోదీ నివాళి

కార్గిల్ విజయదివస్ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ కార్గిల్‌లోని ద్రాస్‌లో గల యుద్ధవీరుల స్మారకాన్ని సందర్శించారు. ఈ యుద్ధంలో ప్రాణాలర్పించిన వీర సైనికులకు అంజలి ఘటించారు. అనంతరం అమర జవాన్ల సతీమణులు, కుటుంబసభ్యులతో కాసేపు ముచ్చటించారు. గత చరిత్ర నుండి పాకిస్థాన్ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని, వారికి ధీటుగా బదులిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. సైనికుల త్యాగాలకు భారతావని ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు. లద్ధాఖ్, జమ్ముకాశ్మీర్ అభివృద్ధి కోసం ఎలాంటి సవాళ్లనైనా భారత్ అధిగమిస్తుందన్నారు. సైన్యాన్ని బలోపేతం చేసే ఉద్దేశంతో ప్రారంభించిన అగ్నిపథ్ పథకంపై విమర్శలు చేస్తున్న విపక్షాలపై మండిపడ్డారు. ఇది దేశ సైన్యాన్ని ఆధునికీకరించడానికి అవసరమైన సంస్కరణ అన్నారు.

మరికొన్ని రోజులలో ఆర్టికల్ 370ని రద్దు చేసి ఐదేళ్లు పూర్తవుతాయని, జమ్ముకాశ్మీర్ ప్రజలు సరికొత్త భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నారు. వారి పెద్ద కలలను నెరవేరుస్తాం అని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన షింకున్ లా టన్నెల్ ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ ట్విన్ ట్యూబ్ టన్నెల్‌ను 4.1 పొడవున 15,800 మీటర్ల ఎత్తుల్లో నిర్మిస్తున్నారు. దీని నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే అతి ఎత్తైన సొరంగంగా గుర్తింపు వస్తుంది.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్ వేదికగా స్పందించారు. అమరవీరుల త్యాగాలు గుర్తు చేసుకున్నారు. 1999 నాటి కార్గిల్ యుద్ధంలో మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన ప్రతీ జవాన్‌కు నివాళులు అర్పిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా అమర జవాన్లకు నివాళులర్పించారు.