మంత్రి ఉషశ్రీ వ్యాఖ్యలు సిగ్గుచేటు అన్న అంగన్‌వాడీలు
ఏపీలో తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీలు గతకొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై నిన్న మంత్రి ఉషశ్రీ చరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అంగన్ వాడీలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ మేరకు వారు ఇవాళ మంత్రి ఉషశ్రీ చరణ్ వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. కాగా మంత్రి ఉషశ్రీ అంగన్‌వాడీ కార్యకర్తలు,ఆయాలకు చీరల కోసం రూ.16 కోట్లు,వారి స్మార్ట్ ఫోన్ల కోసం రూ.85 కోట్లు వెచ్చించామని తెలిపారు. అంతేకాకుండా వారి రీఛార్జ్‌ల కోసం రూ.12 కోట్లు ఖర్చు చేశామని మీడియా సమావేశంలో చెప్పడం సిగ్గుచేటని అంగన్‌వాడీలు మంత్రి ఉషశ్రీ చరణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారు ఈ రోజు మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిని నిర్భందించారు. అంతేకాకుండా వారు మచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్ వద్ద బైఠాయించి ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు అంగన్‌వాడీలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ అంగన్‌వాడీలు,పోలీసుల మధ్య వాగ్వాదం,తోపులాట జరిగింది. కాగా ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు,CITU నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

