నిరుద్యోగంలో ప్రథమస్థానంలో ఆంధ్రప్రదేశ్
డిగ్రీలు చదివిన గ్రాడ్యుయేట్లలో 24 శాతం నిరుద్యోగ రేటుతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. కేంద్రప్రభుత్వం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం జాతీయ సరాసరి 13.4 శాతం ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 24 శాతం నిరుద్యోగరేటు ఉంది. మరో తెలుగురాష్ట్రమైన తెలంగాణ 16.6 శాతంతో 9వస్థానంలో ఉంది. గత సంవత్సరం దాకా చివరి స్థానంలో ఉన్న వెనుకబడిన రాష్ట్రమైన బీహార్‌ను కూడా వెనక్కు నెట్టి ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. డిగ్రీలు చదివిన మహిళలలో 34.6 శాతం నిరుద్యోగిత ఉండగా.. అది పురుషులలో 20 శాతంగా ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ విధానాల వల్ల కొత్త పరిశ్రమలు రాకపోవడం, ఉన్న పరిశ్రమలే రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఏపీలో పెద్ద నగరాలైన విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి నగరాలలో కూడా ఐటీ పార్కులు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు లేవు. దీనితో బీటెక్ ప్రాంగణ నియామకాలు కూడా తగ్గిపోయాయి. సాధారణ డిగ్రీలు చదివిన వారికి అసలే ఉద్యోగం అందని ద్రాక్షయ్యింది. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు కూడా భర్తీ చేయడం లేదు. మెగా డీఎస్సీ ద్వారా 23 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేస్తానని పాదయాత్ర సమయంలో చెప్పిన ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు కావస్తున్నాఒక్క డీఎస్సీని కూడా నిర్వహించలేదు.

