ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖపట్నం-ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటన
సీఎం జగన్ ఏపీ రాజధానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే వైజాగ్ కేపిటల్‌గా మారబోతుందని… తన కార్యకలాపాలు సైతం అక్కడ్నుంచే కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్లో నిర్వహించిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏపీ రాజధానిపై విస్పష్టమైన ప్రకటన చేశారు. త్వరలో విశాఖపట్నం ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అవుతుందని రాబోయే నెలల్లో అక్కడికి తాను వెళ్లబోతున్నానని… మీరందరూ కూడా రావాలంటూ కూడా పారిశ్రామికవేత్తలను సీఎం జగన్ కోరారు. త్వరలో తాను కూడా అక్కడ్నుంచే పనిచేస్తానంటూ ఈ సందర్భంగా జగన్ వివరించారు. మార్చి 3, 4 తేదీల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌ను రావాల్సిందిగా పారిశ్రామికవేత్తలను కోరారు.

2014లో ఆంధ్ర ప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయినప్పుడు, ఏపీకి రాజధాని లేకుండా పోయింది. కృష్ణానది ఒడ్డున విజయవాడ-గుంటూరు ప్రాంతంలోని అమరావతిని కొత్త రాజధానిగా ఏర్పాటు చేస్తామని 2015లో చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం పేర్కొంది. ఐతే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్… రాష్ట్రానికి మూడు రాజధాని నగరాలంటూ ప్రకటించారు. ఎగ్జిక్యూటివ్‌కు విశాఖపట్నం, లెజిస్లేచర్‌కు అమరావతి, న్యాయవ్యవస్థకు కర్నూలుగా ప్రణాళికలు రూపొందించారు. న్యాయపరమైన చిక్కుముడులతో ఆ చట్టం తరువాత ప్రభుత్వం ఉపసంహరించుకొంది. ప్రస్తుతం అమరావతి రాజధానిగా కొనసాగుతోంది.