NMDC చేతికి ఆంధ్ర బంగారుగనులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బంగారు గనుల తవ్వకానికి కేంద్రప్రభుత్వ సంస్థ NMDC సిద్దపడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, చిత్తూరు జిల్లాలలో బంగారు గనులు ఎప్పుడో కనిపెట్టారు. ఇప్పటికే ఇనుప ఖనిజం తవ్వకం చేపడుతున్న ఈ సంస్థ ఇప్పుడు బంగారం వెలికి తీయడానికి 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతోందని సమాచారం. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే నిర్వహించి ఎక్కడెక్కడ బంగారు నిల్వలు ఉన్నాయో సమాచారం సేకరించింది. చిత్తూరు జిల్లాలోని కుప్పం గుడుపల్లె మండలంలో చిగర్ గుంట-బిసనత్తమ్ అనే బంగారు గని ఉంది. దీనిలో దాదాపు 18 లక్షల టన్నుల బంగారు ముడి ఖనిజం లభిస్తుందని అంచనా. ఒక్కో టన్ను నుండి 5 గ్రాముల వరకు బంగారం లభిస్తుంది. దీనితో రాష్ట్రప్రభుత్వంతో ఇప్పటికే ఒప్పందాలు పూర్తి చేసుకుంది NMDC సంస్థ. లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై సంతకాలు తీసుకుంది. అనంతరం పర్యావరణ అనుమతులు, మైనింగ్ లీజు వంటి ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకెళ్లి తవ్వకాలు ఆరంభిస్తారు. దీనికి మరో రెండేళ్ల కాలం పట్టవచ్చు. చత్తీస్ గఢ్, కర్నాటక రాష్ట్రాలలో ఇనుప ఖనిజాన్ని, మధ్యప్రదేశ్‌లో పన్నాలో వజ్రాల గనిని నిర్వహిస్తోంది ఈ సంస్థ. ఇప్పటికే కుప్పం దగ్గరలోని కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌లో బంగారం గనులను తవ్వుతున్నారు. రాయచూర్ సమీపంలో కర్ణాటకకు చెందిన హుట్టి గోల్డ్ మైన్స్ కంపెనీ దేశంలోని అతిపెద్ద బంగారు గనిని నిర్వహిస్తోంది. NMDC సంస్థకు ఇదే మొట్టమొదటి బంగారు గని తవ్వకం కాబోతోంది.

