Andhra PradeshHome Page Slider

ఏపీలో ధనిక సీఎం అరాచక పాలన- కన్నా విసర్లు

ఏపీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచక పాలన మొదలైందని మాజీ మంత్రి ఇటీవల భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఈ నెల 23న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో తాను ఆ పార్టీలో చేరుతున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. తనతో పాటు తన అనుచరులు నేతలు కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతారని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీలో తన పాత్ర ఏమిటి అనేది పార్టీ తీసుకునే నిర్ణయం పై ఆధారపడి ఉంటుందన్నారు. పార్టీ అధినేత నిర్దేశాలకు అనుగుణంగా నడుచుకుంటానన్నారు. గుంటూరులోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడిన కన్నా లక్ష్మీనారాయణ గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడిని ఖండించారు. ఆంధ్రప్రదేశ్ కు పనిచేసిన ముఖ్యమంత్రులందరు రాష్ట్రంలో ఫ్యాక్షన్ నియంత్రించేందుకు చర్యలు తీసుకొని పకడ్బందీగా అమలు చేశారని అయితే ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఫ్యాక్షన్ సంస్కృతిని పెంచి పోషిస్తున్నారన్నారు. జగన్ దేశంలోనే అత్యంత ధనిక సీఎం అని వ్యాఖ్యానించారు. ఒకసారి ఎన్నికల్లో పెట్టుబడి పెట్టి ఆపై రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని విమర్శించారు. దీనికి పోలీసులు కూడా వంత పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన 50 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఏనాడు ఇలాంటి పరిస్థితి చూడలేదని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.