మాట నిలబెట్టుకోని ఇంటర్ బోర్డు- హాల్ టికెట్ కోసం విద్యార్థుల వెతలు
ఇంటర్ బోర్డు విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్షలకు అనుమతిస్తామని రెండురోజుల క్రితం వెల్లడించింది. కానీ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే లింక్‌ను వెబ్‌సైట్‌లో ఉంచలేదు. ప్రిన్సిపాల్స్‌కు మాత్రమే కళాశాలల లాగిన్ నుండి డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఇచ్చింది. అంటే విద్యార్ధులకు హాల్ టికెట్లు ప్రిన్సిపాల్స్ ఇవ్వాల్సిందే. దీనితో ఫీజు బకాయిలు ఉన్న విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఫీజు బకాయిలు చెల్లించమని ఒత్తిడి చేస్తున్నారు. ఓ కార్పొరేట్ కాలేజీలో తల్లిదండ్రులకు ఫోన్లు చేసి, బకాయిలు చెల్లిస్తేనే హాల్‌టికెట్లిస్తామని చెప్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ సంఘటనలపై ఇంటర్ బోర్డును వివరణ కోరగా.. లింక్‌ను వెబ్‌సైట్‌లో పెట్టాలంటే బోర్డు కార్యదర్శి నుండి ఆదేశాలు రావాలని, వచ్చిన వెంటనే లింక్‌ను పెడతామని పేర్కొన్నారు. ఈ నెల 15 నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

