Home Page SliderTelangana

కుక్క అంటే మరీ ఇంత భయమా..?

ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ భయాలు ఉండడం అనేది సహజం. అయితే ఆ భయంతో ప్రాణాలు పొగొట్టుకునే పరిస్థితి ఏర్పడితే మాత్రం ఆ భయం ప్రమాదకరమనే చెప్పాలి.  అలా భయంతో ఓ వ్యక్తి ప్రాణాల మీదికి తెచ్చుకున్న ఘటనే హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో చోటు చేసుకుంది. ఫుడ్ డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్ ఆ ఇంట్లో కుక్కను చూసి భయపడి 3వ అంతస్తు నుంచి కింద పడ్డాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..యూసఫ్‌గూడలోని శ్రీరామ్‌నగర్‌కు  చెందిన మహ్మద్ రిజ్వాన్ గత 3 సంవత్సరాల నుంచి స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నారు.

అయితే రిజ్వాన్ గత రాత్రి ఫుడ్ డెలివరీ చేసేందుకు బంజారాహిల్స్‌ రోడ్ నెం.6లో ఉన్న లుంబిని రాక్ క్యాసిల్ అపార్ట్‌మెంట్ 3వ అంతస్తులోకి వెళ్లారు. అతను అక్కడికి వెళ్లి తలుపు తట్టగానే ఇంట్లో ఉన్న జర్మన్ షపర్డ్ డాగ్ మొరుగుతూ.. వచ్చింది. దాన్ని చూసి భయాందోళనకు గురైన రిజ్వాన్ 3వ అంతస్తు నుంచి ఒక్కసారిగా కిందకు దూకాడు. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. ఇది గమనించిన ఇంటి యజమాని శోభన, రిజ్వాన్‌ను వెంటనే అంబులెన్స్‌లో నిమ్స్‌ హస్పిటల్‌కు తరలించారు. కాగా ఇంటి యజమాని నిర్లక్ష్యం కారణంగానే రిజ్వాన్‌కు ఈ దుస్థితి ఏర్పడిందని రిజ్వాన్ సోదరుడు ఆరోపించారు. ఈ ప్రమాదం సంభవించడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.