జనసేనతో పొత్తు అవసరం లేదు
తెలంగాణలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీతో తమకు పొత్తు అవసరం లేదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో బీజేపీ బలంగా ఉందని, రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా అక్కడ కూటమిగా ఏర్పడ్డామని, అయితే తెలంగాణలో ఆ అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. “తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోంది. జనసేనతో పొత్తు అవసరం లేదన్న విషయాన్ని జాతీయ అధిష్ఠానానికి కూడా వివరిస్తాం. ఒకవేళ పొత్తుపై ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే అది జాతీయ స్థాయిలోనే జరుగుతుంది” అని ఆయన వెల్లడించారు.
జనసేన పార్టీ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించింది. పవన్ కళ్యాణ్ ఆశయాలను తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో అభ్యర్థులను నిలుపుతామని జనసేన ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ పేర్కొన్నారు. జనసేన ప్రకటన వచ్చిన 24 గంటల లోపే రాంచందర్ రావు ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టడం ఖాయమని రాంచందర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఎన్నికల క్షేత్రంలోకి వెళ్తామని పేర్కొన్నారు.

