ఆసక్తి రేపిన అమిత్ షాతో బాద్ షా భేటీ
ఒకరిది ..పరిణతి.. పరిపక్వత… నట వైదుష్యంతో కూడిన వ్యక్తిత్వం. ఇంకొకరిది రాజనీతిజ్ఞత.. పాలనా దక్షత.. వాక్చతురత. వీరిద్దరూ కలిశారు. కొద్దిసేపు ఏకాంతంగా చర్చలు జరిపారు. సరదా అంశాలతో .. సినీ ప్రస్తావనలతో చర్చ సాగినా .. ఆంతర్యం ఏమిటా అన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. రాజకీయ ప్రాధాన్యతా అంశంగా మారుతోంది. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దేశ రాజకీయాలలో కేంద్ర బిందువుగా ఉన్న అమిత్ షాయే ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశం కావడం .. కలిసి డిన్నర్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అసలు ఆయన హైదరాబాద్ షెడ్యూల్ లో ఈ భేటీ లేకపోయినా అకస్మాత్తుగా జూనియర్ ఎన్టీర్ తో సమావేశం తెరపైకి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీంతో జూనియర్ ఎన్టీర్ బీజేపీలో చోరబోతున్నాడా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

మంచి రూపం.. ఆకట్టుకునే మాటకారి తనం.. చెరగని చిరునవ్వు.. మాంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. దానికి తోడు కొద్దోగొప్పో రాజకీయ అనుభవం కూడా ఉంది. గతంలో టీడీపీ తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి .. అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాడు. ప్రచార సరళిని వేడెక్కించాడు. జనం నాడిని పట్టి ప్రసంగాలు చేశాడు. ఔరా అన్నారు.. శభాష్ అనీ కొనియాడారు. అయితే ఆ తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. సినిమాలపైనే దృష్టి పెట్టి .. ఎన్నో విజయవంతమైన సినిమాలను అందించారు. అద్భుతాలు సృష్టించారు. ఆయన నటించిన త్రిబుల్ ఆర్ ఆస్కార్ అవార్డులకు నామినేట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ తరుణంలో ఒక్కసారిగా అమిత్ షా రూపంలో అదృష్టం ఆయన తలపుతట్టింది. ఆయనతో భేటీకి అమిత్ షా ఆసక్తి చూపడం అటు రాజకీయ వర్గాలనే కాదు.. ఇటు సినీ వర్గాలను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. అయితే ఇద్దరి మధ్య ఏం జరిగింది ? ఏఏ అంశాలపై చర్చలు జరిగాయి అన్నదే ఉత్కంఠ రేపుతోంది.

మునుగోడులో నిర్వహించిన బహిరంగ సభ ముగించుకుని హైదరాబాద్ వచ్చిన అమిత్ షా శంషాబాద్ విమానాశ్రయంలోని నోవాటెల్ హోటల్ లో దాదాపు 45 నిమిషాల పాటు జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారు. 20 నిమిషాల పాటు ఇద్దరి మధ్య ఏకాంత చర్చలు సాగాయి. అనంతరం వీరిద్దరితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపి వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ ఛుగ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కలిసి డిన్నర్ చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా, కిషన్ రెడ్డికి శాలువా కప్పి జూనియర్ ఎన్టీఆర్ సత్కరించారు. అయితే అమిత్ షా .. జూనియర్ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని.. కేవలం ఆయనను ప్రశంసించడానికే అమిత్ షా కలుసుకున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. అనంతరం ట్వీట్ల ద్వారా ఇద్దరూ తమ అనుభవాలను పంచుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, అత్యంత ప్రతిభావంతుడైన నటుడుని కలవడం సంతోషాన్ని ఇచ్చిందని అమిత్ షా ట్వీట్ చేశారు. దీనికి ప్రతిగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్విట్టర్ లో స్పందిచారు. మిమ్ములను కలుసుకోవడం.. మీతో మాట్లాడడం చాలా చాలా ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేశారు.

వీరిద్దరి కలయికపైనే ఇప్పుడు అన్ని రాజకీయా పార్టీలూ దృష్టి పెట్టాయి. ఆంతర్యం ఏమిటా అని ఆరాలు తీసే పనిలో పడ్డాయి. అయితే ప్రస్తుత రాజకీయాలు.. జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తి.. టాలీవుడ్ విశేషాలు.. ఎన్టీఆర్ నటించిన, నటించబోయే చిత్రాల వివరాలను అమిత్ షా అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలై, పెద్ద సంచలనం రేపిన త్రిబుల్ ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీర్ నటన అమిత్ షాను అమితంగా ఆకట్టుకుందట. అందుకే జూనియర్ ను కలిసి ప్రశంసించాలని అనుకున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కానీ.. వీరిద్దరి భేటీ వెనుక రాజకీయ కారణాలు ఉండొచ్చని భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ బీజేపీలో చేరబోతున్నారా ? రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రచారం చేసే అవకాశం ఉందా ? దీంతో ఎన్నికల ముఖ చిత్రం మారబోతోందా ? ఇవే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ పార్టీలనే కాదు.. సినీ వర్గాలనూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చూద్దాం.. ఏం జరగబోతోందో.

