అమితాబ్‌పై అలవిమాలిన అభిమానం..రూ.60 లక్షలతో విగ్రహం
అభిమానుల అభిమానం కట్టలు తెంచుకుంది. ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్‌కు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా న్యూజెర్సీలోని ఒక ఇంటి ముందు ఆయన విగ్రహం ఆవిష్కరించబడింది. తమ అభిమాన హీరోల కోసం ఫ్యాన్స్ ఏ పనిచేయడానికైనా సిద్దంగా ఉంటారు. ఈ అభిమానంతోనే వాళ్ల ఫ్లెక్సీలు ,కటౌట్లకు పూజలు ,పాలభిషేకాలు చేస్తుంటారు. మరికొందరు అయితే అభిమానంతో ఏకంగా గుళ్లు,గోపురాలను కట్టించి వారిని పూజిస్తుంటారు. అయితే ఇప్పుడు ఇలాంటి సంఘటనే అమెరికాలో చోటు చేసుకుంది. బాలీవుడ్ బాద్ షా అమితాబ్ బచ్చన్‌పై తమకు ఉన్న అభిమానాన్ని ఒక కుటుంబం వినూత్న రీతిలో తెలియజేసింది. ఆయనపై ఉన్న అభిమానంతో ఏకంగా అమితాబ్ విగ్రహాన్ని తమ ఇంటి ముందు ఏర్పాటు చేసింది. ఇదంతా అమెరికాలోని న్యూజెర్సీలోని ఎడిసన్ సిటీలో జరిగింది. భారతీయ సంతతికి చెందిన గోపి సేథ్ ఇంటర్నెట్ సెక్యూరిటీ ఇంజనీర్ ఇక్కడ నివాసముంటున్నారు.

అయితే ఆయనకు తన కుటుంబానికి అమితాబ్ బచ్చన్ అంటే విపరీతమైన అభిమానం. దీంతో వారు అమితాబ్ స్టైల్‌గా కూర్చున్న విగ్రహాన్ని తమ ఇంటి ముందు ఆవిష్కరించారు. ఆ విగ్రహాన్ని ఓ పెద్ద గ్లాస్ బాక్స్‌లో ఉంచారు. ఈ విగ్రహావిష్కరణ వేడుకకు దాదాపు 600 మంది హాజరై సందడి చేశారు. అయితే ఈ వేడుకను ఆ కుటుంబం చాలా గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ వేడుకలో భాగంగా డ్యాన్స్‌లు వేస్తూ..బాణాసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు.

ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను గోపిసేథ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో ఆయన ఈ విధంగా రాసుకొచ్చారు. “న్యూజెర్సీలో 1991లో నవరాత్రి ఉత్సవాల సమయంలో తొలిసారి బిగ్‌బీని కలిశాను. అప్పటి నుంచి ఆయనకు ఆయనకు వీరాభిమానిని అయ్యాను. నాకు, నా భార్యకు ఆయన దేవుడు లాంటి వారు. రీల్‌లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ ఆయన మాట్లాడే విధానం ,ఉండే విధానం నాలో ఎంతో స్పూర్తిని నింపింది. ఆయన ఉన్నత స్థాయికి ఎదిగిన ఒదిగి ఉండే మనిషి. తన అభిమానుల సంక్షేమాలు చూసుకుంటారు. మిగతా స్టార్స్‌లా కాదు , ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తారు. అందుకే నా ఇంటి ముందు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశాం “అని గోపి సేథ్ తెలిపారు.

