National

NIA దర్యాప్తు సంస్థలతో అమిత్ షా కీలక భేటీ

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా  కార్యకలాపాల విషయంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దాడులు కొనసాగిస్తున్న విషయం మనకు తెలిసినదే. పలువురు PPF కార్యకర్తలు, ఉగ్ర అనుమానితుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక భేటి నిర్వహించారు. దీనిలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, NIA డైరక్టర్ జనరల్ దినకర్ గుప్తాతో సహా పలువురు కీలక అధికారులు ఈ రోజు ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.

దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని పీఎఫ్ఐ కార్యాలయాలు, సభ్యుల ఇళ్లపై ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ 100 మందికి పైగా కార్యకర్తలు, నేతలను అరెస్టు చేశారు. అత్యధికంగా కేరళలో 22 మందిని అరెస్టు చేశారు. మహారాష్ట్రలో 20, కర్ణాటకలో 20, తమిళనాడులో 10, ఉత్తరప్రదేశ్‌లో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంస్థ యువతకు శిక్షణ ఇచ్చే నెపంతో చట్టవిరుద్ధ కార్యకలాపాలు సాగిస్తోందనే ఆరోపణలు బాగా వచ్చాయి. ముఖ్యంగా ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందిస్తున్నట్లు, తీవ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో NIA, ED వంటి దర్యాప్తు సంస్థలు ఈ కార్యాలయాలు, సభ్యుల ఇళ్లపై దాడులు చేపట్టాయి. ఈ దాడుల అనంతరం నిజానిజాలు విచారించి ఈ సంస్థపై కేంద్రం నిషేధం విధించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు అమిత్ షా ఈ అత్యవసర భేటీ నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.