ముస్లింల మనసు చూరగొన్న అమిత్ షా
ముస్లింల వ్యతిరేకిగా ముద్రపడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. జమ్మూకశ్మీర్‌లో అదే ముస్లింల మనసు గెలుచుకున్నారు. బారాముల్లాలో అమిత్ షా ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా సమీప మసీదు నుంచి అజా (ప్రార్థన) సౌండ్ వినిపించింది. దీంతో ప్రసంగాన్ని ఆపేసిన అమిత్ షా ‘మసీదులో ఏం జరుగుతోంది’ అని పక్కనున్న వారిని అడిగారు. ప్రార్థన జరుగుతోందని వాళ్లు చెప్పడంతో కొద్దిసేపు ఆగిపోయారు. అజా శబ్దం పూర్తయిన తర్వాత.. ‘అయిపోయిందా..? ఇక నేను ప్రసంగించొచ్చా..?’ అని ప్రశ్నించారు. దీంతో సభకు హాజరైన వారు చప్పట్లు, ఈలలతో ఆయనను అభినందించారు.

కేంద్ర హోం మంత్రి చర్యను అభినందిస్తూ పలువురు కశ్మీరీలు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. అంతేకాదు.. ప్రజలతో తాను నేరుగా మాట్లాడాలనుకుంటున్నానని చెప్పిన అమిత్ షా తన ముందున్న బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్‌ను తొలగించి ప్రసంగించడం విశేషం. మొత్తానికి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో కశ్మీరీల హృదయంలో చెరగని ముద్ర వేసేందుకు ఈ పర్యటనను అమిత్ షా ఉపయోగించుకున్నారు.

